కరప్షనే లేనప్పుడు ఏసీబీకి కేసు పెట్టే అర్హతే లేదు

ఫార్ములా -ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్‌ నోటీసులు ఇచ్చింది :మాజీ మంత్రి కేటీఆర్‌

Advertisement
Update:2024-12-19 21:36 IST

ఫార్ములా -ఈ సంస్థకు చెల్లింపుల్లో కరప్షపూ లేనప్పుడు ఏసీబీకి కేసు పెట్టే అర్హత ఎక్కడిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఫార్ములా -ఈ రేసు హైదరాబాద్‌ కు తీసుకురావడం, ఆ సంస్థకు చెల్లింపులు చేయడం సహా వివరాలన్నీ వెల్లడించారు. ''రేవంత్‌ అక్రమాలను బయట పెడుతున్నందుకు ఆయనకు కడుపు మంట ఉండటం సహజం.. హైదరాబాద్‌, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడానికి మేం ప్రయత్నించాం.. అందుకే రూ.55 కోట్లు చెల్లించాం.. నాపై కేసు పెడితే ఫార్ములా -ఈపైనా కేసు పెట్టాలి.. అదే జరిగితే ప్రపంచం మొత్తం మీద తెలంగాణ ఇజ్జత్‌ పోదా.. మన రాష్ట్రం నవ్వుల పాలు కాదా.. నాపై కేసు పెట్టుకోవాలంటే పెట్టుకో.. రాష్ట్రం పరువు మాత్రం తీయకు.. దివ్యమైన తెలంగాణను దివాళా తెలంగాణ అని మాట్లాడుతున్నారు.. ఇంకా రాష్ట్రం పరువు తీయకు.. శాంతియుతంగానే మేము ఈ కేసును ఎదుర్కొంటాం.. రేవంత్‌ లీకు వీరుడు.. వాళ్లు అంతపాటి సిపాయిలు అయితే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను.. దివానాగాడు, హౌలా గాడు తప్ప ఇలాంటి కేసులు ఎవరూ పెట్టరు..మేం ఉద్యమ నాయకుడి బిడ్డలం.. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు.. మేం లీగల్‌గానే కొట్లాడుతాం.. పోలీసులకు, ఏసీబీకి ఇవే వివరాలు చెప్తా.. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడుతామంటే ప్రజలు చూసుకుంటారు..'' అన్నారు.


 



తనపై కేసు పెట్టేందుకు గవర్నర్‌ అనుమతించారనే ప్రశ్నపై స్పందిస్తూ గవర్నర్‌కు తాను ఉద్దేశాలు ఆపాదించనని తెలిపారు. గవర్నర్‌ తో ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో తనక తెలియదన్నారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే గుండె ధైర్యం ఉందన్నారు. ''రేవంత్‌ రెడ్డి మొగోడు అయితే ఓఆర్‌ఆర్‌ టెండర్‌ క్యాన్సిల్‌ చేసి ఆ తర్వాత విచారణ చేయాలి'' అని డిమాండ్‌ చేశారు. ''కుంభకోణం.. లంభకోణం అని కేబినెట్‌లో గంటన్నర సేపు చర్చించిండ్రట.. నాలుగు గోడల మధ్య నలుగురు సన్నాసులు మాట్లాడుడు ఏంది.. నాలుగు కోట్ల మంది ప్రజల మధ్య చర్చ పెడదామని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాం.. పానీ కా పానీ.. దూద్‌ కా దూద్‌ తేలిపోతుంది.. అసెంబ్లీ నడుస్తోంది చర్చ పెట్టు దమ్ముంటే అని సవాల్‌ చేశా.. రేపు, ఎల్లుండి అసెంబ్లీ ఏదో నడిపించి అవతల పడుతరు తప్ప చేసేదేమి లేదు. ప్రభుత్వానికి చర్చలో పాల్గొనే సత్తా లేదు.. ఈ ముఖ్యమంత్రికి కళ్లలో కళ్లు పెట్టి చూసి ఈ తప్పు జరిగిందని నిరూపించే ధైర్యం, దమ్ము లేదు.. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే నేను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. వారికి నిజాలు చెప్పేందుకే ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నాం'' అని తెలిపారు.

2001లో ఫార్ములా వన్‌ రేస్‌ హైదరాబాద్‌ కు తేవాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని, గోపన్‌పల్లిలో ఫార్ములా వన్‌ రేస్‌ పర్మినెంట్‌ ట్రాక్‌ కోసం ఐదు వందల ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు రైతులకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అప్పుడు నోటీసులు అందుకున్న రైతుల్లో రేవంత్‌ రెడ్డి కూడా ఉన్నారని గుర్తు చేశారు. ''2009లో నోయిడాలో ఫార్ములా వన్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, జేపీ గ్రూప్‌ రూ.1,500 కోట్ల నుంచి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.. మూడేళ్ల పాటు ఈ రేస్‌ నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున రేసులు ఇండియాలో నిర్వహించలేదు. చిన్నపాటి రేసులు మాత్రం జరిగాయి. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఫార్ములా -4 రేస్‌ కు అక్కడి ప్రభుత్వం రూ.42 కోట్లు ఖర్చు పెట్టింది. ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ 14 రంగాలను ఎంపిక చేసి ఆయా రంగాల్లో పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈక్రమంలోనే ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ తెచ్చాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన జీనోమ్‌ వ్యాలీని ఆ తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయని, దీంతో హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ హబ్‌ గా మారిందన్నారు. తెలివైన ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం తెచ్చిన మంచి పనులను కొనసాగిస్తుంది.. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ హబ్‌గా హైదరాబాద్‌ ను మార్చాలని ప్రయత్నించాంవరుసగా నాలుగేళ్ల పాటు రేస్‌ నిర్వహించేందుకు 2022లో అగ్రిమెంట్‌ చేసుకున్నాం'' అని తెలిపారు.

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలని అనుకున్నాం.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అడ్డాగా తెలంగాణను మార్చాలన్న ఎజెండాతో తాము ప్రయత్నించామన్నారు. మొదట ఇక్కడ ఫార్ములా - ఈ పెట్టేందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంలోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఫార్ములా -ఈ రేస్‌ నిర్వాహకులు, గ్రీన్‌ కో సబ్సిడర్‌ సంస్థ ఏస్‌ జెన్‌ మధ్య ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఈ కార్‌ రేస్‌ జరుగుతున్న సమయంలో వారం రోజుల పాటు వారం రోజుల పాటు మొబిలిటీ వీక్‌ నిర్వహించి పలు పెట్టుబడులు ఆకర్శించామన్నారు. కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డితో పాటు సచిన్‌ టెండుల్కర్‌, ఆనంద్‌ మహీంద్ర లాంటి ప్రముఖులు ఈ రేసులో పాల్గొన్నారు. బాంబేలో గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద రేస్‌ కార్‌ ను పెట్టి ప్రమోషన్‌ చేశాం.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే, నితిన్‌ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి, క్రికెటర్లు పాల్గొన్నారని తెలిపారు. మొదటి రేస్‌ కు హెచ్‌ఎండీఏ నుంచి రూ.30 నుంచి 35 కోట్లు ఖర్చు చేశామని, ప్రమోటర్‌ గ్రీన్‌ కో రూ.110 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నెల్సన్‌ అనే సంస్థ హైదరాబాద్‌ లో ఈ రేస్‌ తర్వాత రూ.82 మిలియన్‌ డాలర్ల ఎకనామిక్‌ బెనిఫిట్‌ వచ్చిందని తన నివేదికలో వెల్లడించింది. రూ.150 కోట్లు ఖర్చు చేస్తే రూ.700 కోట్ల లాభం జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నది. తమకు పైసలు రాలేదని చెప్తూ గ్రీన్‌ కో స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలిగిందన్నారు.

హైదరాబాద్‌ ను ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కు రెస్టినేషన్‌ మార్చాలని తాము ప్రయత్నించామన్నారు. ''ఎలన్‌ మస్క్‌ ను హైదరాబాద్‌ కు తీసుకురావాలని అనుకున్న.. ఇక్కడికి టెస్లా తేవాలనేది నా ఆలోచన.. ప్రమోటర్‌ ను వేరే వాళ్లను చూద్దామని అనుకున్నాం.. ఎన్నిక్లలో పడి చేయలేకపోయాం.. 2023 ఆగస్టు 16లోగా రేస్‌లో హైదరాబాద్‌ ఉండాలని అనుకుంటే డబ్బులు చెల్లించాలని ఫార్ములా -ఈ ఫౌండర్‌ ఆల్బర్టో లాంగో నాకు ఈ మెయిల్‌ చేశారు.. మన గవర్నమెంట్‌ వచ్చిన తర్వాత ప్రమోటర్‌ ను చూద్దామని చెప్పాను.. స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌ అక్టోబర్‌ 5, 11 తేదీల్లో ఫార్ములా ఈ సంస్థకు రూ.55 కోట్లు చెల్లించారు. మేం డబ్బులు కట్టిన తర్వాత వాళ్ల క్యాలెండర్‌ లో హైదరాబాద్‌ ను ఫార్ములా -ఈ ఇంక్లూడ్‌ చేసింది. మాంట్రియాల్‌ అనే నగరంలో ఎన్నికల తర్వాత కొత్త మేయర్‌ వచ్చిన తర్వాత ఫార్ములా -ఈ ని రద్దు చేస్తే 3 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించి ఆ సంస్థతో సెటిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఓడిపోయాం.. డిసెంబర్‌ 13న ఆల్బర్టో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. దానాకిషోర్‌ కు ఆల్బర్టో 19న ఈ మెయిల్‌ చేశారు.. ఆ లేఖలోనే తాను సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశానని కూడా ఆల్బర్టో పేర్కొన్నాడు. రేవంత్‌ రెడ్డితో జరిగిన సమావేశం కూడా ఎంకరేజింగ్‌ మోడ్‌లో జరిగిందని ఆ మెయిల్‌ లో పేర్కొన్నారు.. కాంట్రాక్ట్‌ బ్రీచ్‌ చేశారు కాబట్టి ఫార్ములా - ఈ రేస్‌ కాంట్రాక్టు రద్దు చేస్తున్నామని డిసెంబర్‌ 22న ఫార్ములా లీగల్‌ డైరెక్టర్‌ ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఈ మెయిల్‌ చేశారు. మొదటి రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు మీ ప్రభుత్వం చెల్లించారని, మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించాడని నాలుగు రోజులు టైం ఇస్తున్నామని.. ఆలోగా చెల్లించకుంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని ఆ లేఖలో తేల్చిచెప్పారు.. '' అని ప్రభుత్వంతో ఫార్ములా -ఈ మధ్య జరిగిన మొత్తం కమ్యూనికేషన్‌ ను వివరించారు.

ఫార్ములా -ఈ ఒక్కటే కాదు.. ఫోన్‌ ట్యాపింగ్‌ అని ఏదో చెప్తున్నడని దానిపైనా దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. ''ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ లోని హెచ్‌ఎండీఏ ఎకౌంట్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేశాం.. ఆ చెల్లింపులు కూడా ఆర్‌బీఐ నిబంధనల లోబడే చేశాం. ఇండియా ఇజ్జత్‌ తీసిన రేవంత్‌ రెడ్డిపై కేసు పెట్టాలి. మోటార్‌ స్పోర్టింగ్‌ లో ఇండియాను ఇకపై ఎవరు నమ్మరని ప్రపంచంలోని అనేక రేసింగ్‌ సంస్థలు దుమ్మెత్తిపోశాయి.. ఫార్ములా -ఈ వాళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లో ఆర్బిట్రేషన్‌ కు కేసు వేశారు. హరీశ్‌ సాల్వే అనే ప్రముఖ లాయర్‌ ద్వారా ఈ కేసు పెట్టించింది. ఎఫ్‌ఎంఏసీఐ నుంచి వాపస్‌ వచ్చిన పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.. ఈ వివరాలేవి రాష్ట్ర ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు.. '' అన్నారు.

Tags:    
Advertisement

Similar News