సిరియా నుంచి 75 భారతీయులు సురక్షితంగా లెబనాన్‌కు
వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపిన విదేశాంగ శాఖ
తిరుగుబాటు దళాలు సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో భారతీయులను వెనక్కి రప్పించడానికి భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులోభాగంగానే తాజాగా 75 మంది భారతీయ పౌరులను డమాస్కస్ నుంచి లెబన్‌న్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు) ఉన్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు పేర్కొన్నది. ఇంకా అనేకమంది భారతీయులు సిరియాలో ఉన్నారని తెలిపింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌తో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొన్నది.