ఇరాన్ లో మిన్నంటిన హిజాబ్ వ్యతిరేక నిరసనలు... 31 మంది మృతి!

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మరణించారు.

Advertisement
Update:2022-09-23 08:14 IST

ఇరాన్ లో స్త్రీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత కు నిరసనగా ఉద్యమం ఉగ్ర రూపం దాల్చింది. షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం స్త్రీలను ఆటబొమ్మలకన్నా దారుణంగా చూస్తున్నారంటూ స్త్రీలు రోడ్డెక్కారు. వాళ్ళకు మద్దతుగా పురుషులు కూడా చేతులు కలిపారు.

హిజాబ్ సరిగ్గా ధరించలేదంటూ మహ్సా అమిని అనే 22 ఏళ్ళ యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేసి పెట్టిన చిత్ర హింసలవల్ల ఆ యువతి పోలీసు కస్టడీలో మరణించింది. ఆమె మరణంతో ఇరాన్ ఒక్క సారిగా భగ్గున మండింది. తరాలుగా అనుభవిస్తున్న అణిచివేతను ఎదిరిస్తూ మహిళలు తిరగబడ్డారు.

మహిళలు హిజాబ్ లను బహిరంగంగా కాల్చేస్తున్నారు. జుట్టును కత్తిరించుకుంటున్నారు. వేలాది మంది రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం తీవ్రమైన దాడులకు పాల్పడుతోంది. లాఠీచార్జ్ లు, వాటర్ కెనాన్ దాడులు, టియర్ గ్యాస్ ల వరకే ఆగకుండా పోలీసులు కాల్పులు కూడా జరుపుతున్నారు. ఇలా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు ఇరాన్ మానవ హక్కుల సంఘం ప్రకటించింది.

"ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం వీధుల్లోకి వచ్చారు. వారి శాంతియుత నిరసనకు ప్రభుత్వం బుల్లెట్లతో ప్రతిస్పందిస్తోంది" అని ఇరాన్ మానవ హక్కుల (IHR) డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు రోజుల నిరసనల్లో 31 మంది మరణించినట్టు ఆయన తెలిపారు. .

30కి పైగా నగరాలు, పట్టణ కేంద్రాలలో నిరసనలు జరుగుతున్నాయని, వందలాది మందిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారని IHR తెలిపింది.

అమిని మరణించిన మొదటి రెండురోజులు ఆమె స్వస్థలమైన‌ ఉత్తర ప్రావిన్స్ కుర్దిస్తాన్‌లో నిరసనలు చెలరేగాయి, కానీ అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి.

ఉత్తర మజాందరన్ ప్రావిన్స్‌లోని అమోల్ పట్టణంలో బుధవారం రాత్రి 11 మంది మరణించినట్టు, అదే ప్రావిన్స్‌లోని బాబోల్‌లో ఆరుగురు మరణించినట్లు IHR తెలిపింది.

ప్రధాన ఈశాన్య నగరం తబ్రిజ్ నిరసనలలో గురువారంనాడు మొదటి మరణం సంభవించిందని IHR తెలిపింది.

"అంతర్జాతీయ సమాజం ఖండించడం, ఆందోళన వ్యక్తం చేయడం ఇక ఏ మాత్రమూ సరిపోదు. ఈ అంశంలో ప్రపంచం జోక్యం చేసుకోవాలి" అని అమిరీ-మొగద్దమ్ అన్నారు.

అంతకుముందు, కుర్దిస్తాన్ ప్రావిన్స్, ఉత్తర ఇరాన్‌లోని కుర్దిష్ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఎనిమిది మందితో సహా మొత్తం 15 మంది మరణించారని కుర్దిష్ హక్కుల సంఘం హెంగావ్ తెలిపింది.

Tags:    
Advertisement

Similar News