అనుకుంటే ఆనందంగా ఉండొచ్చు!

నిజమైన ఆనందం మనలోనే ఉన్నప్పటికీ రకరకాల ఆలోచనల వల్ల అది చేజారిపోతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు.

Advertisement
Update:2024-07-09 06:00 IST

ఆనందాన్ని పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తారు. అయితే అది ఎక్కడ్నుంచో వస్తుందో ఒక్కసారి ఆలోచించి చూస్తే.. అది మనలోనుంచే పుడుతుందని అర్థమవుతుంది. నిజమైన ఆనందం మనలోనే ఉన్నప్పటికీ రకరకాల ఆలోచనల వల్ల అది చేజారిపోతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆనందాన్ని ఎంత సింపుల్‌గా పొందొచ్చో సైకాలజిస్టుల మాటల్లోనే తెలుసుకుందాం.

డిప్రెషన్, యాంగ్జైటీలతో బాధపడుతన్న వ్యక్తులను పరిశీలించిన సైకాలజిస్టులు.. ఆనందం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఆనందం సహజంగా వస్తుందని దానికి మనమే అడ్డుకట్ట వేస్తున్నామని వారు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి ఓ సైకాలజిస్ట్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

“వాస్తవానికి డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు తమ సంతోషకరమైన క్షణాలను పంచుకుంటారు. అప్పుడు వారిలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అది సహజంగానే వారిలోనుంచి వ్యక్తమవుతుంది. అయితే ఫ్యూచర్ గురించి ఆలోచన లేదా ఇతర విషయాలు గుర్తుకురాగానే హఠాత్తుగా ఆనందం మాయమై ఆందోళన మొదలవుతుంది. ఆందోళన మొదలైనప్పుడు ఆనందం మాయమైనట్టుగానే ఆనందంగా ఉన్నప్పుడు ఆందోళన మాయమవుతుంది. అంటే ఇవన్నీ పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.

ఆనందంగా ఉండకుండా ఎవరికివారే అడ్డుకట్ట వేసుకుంటుంటారు. ఉదాహరణకు చిన్నపిల్లలు ఆనందంగా నవ్వుతూ ఉన్నప్పుడు ‘ఎక్కువగా నవ్వితే తర్వాత ఏడవాల్సి వస్తుంది. అలా ఎక్కువగా నవ్వకూడదు’ అని పెద్దవాళ్లు చెప్తుంటారు. అలా పిల్లలకు చిన్నప్పట్నుంచే ఆనందాన్ని పూర్తిగా వ్యక్తపరచకుండా నేర్పిస్తారు.

ఆనందాన్ని అనుభవించే సామర్థ్యం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. చేయాల్సిందల్లా ఆనందాన్ని కలిగించే విషయాలను గుర్తు తెచ్చుకోవడమే. ఏ విషయాలను గుర్తుంచుకుంటే ఆనందం కలుగుతుందో వాటినే గుర్తుంచుకుంటూ ఉండాలి. ఆలోచన మారితే ఆనందం పోతుంది. కాబట్టి ఆనందాన్ని కలిగించే ఆలోచనల్లోనే ఉండేలా ప్రయత్నించాలి. ఇది ఎవరికి వారు అలవర్చుకోగల కళ.

ప్రతి ఒక్కరికీ జీవితంలో మధురమైన క్షణాలు బోలెడు ఉంటాయి. వాటిని ఎప్పుడు తలచుకున్నా లోపలినుంచి ఆటోమేటిక్‌గా ఆనందం వస్తుంది. అంటే ఆనందానికి ‘కీ’ మన చేతుల్లో ఉన్నట్టే కదా! అంతేకాదు ఇతరుల అనుభవాలను, ఇతరుల ఆనందాన్ని కూడా మన ఆనందంగా మలచుకోవచ్చు. ఉదాహరణకు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలవడం చాలామందిని ఆనందపడేలా చేసింది. ఇదొక సామూహిక ఆనందం వంటిది. ఇలాంటి అనుభూతులు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కూడా ఏర్పరచుకోవచ్చు.”

చివరిగా చెప్పేదేంటంటే.. ఆనందం అనేది మీ అంతరంగానికి ప్రతిబింబం తప్ప వేరొకటి కాదు. మన రోజువారీ జీవితంలోని విషయాలను మనం ఎలా తీసుకుంటున్నదానిపై ఆనందం ఆధారపడి ఉంటుంది. జీవితంతో వచ్చే మలుపులను బట్టి.. ఆనందం, ఆందోళన రెండింటికీ చోటు ఇవ్వాలి. ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండటానికి మీకు మీరే అనుమతి ఇచ్చుకోవాలి.

Tags:    
Advertisement

Similar News