దేశంలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
కర్ణాటకలో ఈ కేసులు గుర్తించినట్లు పేర్కొన్న ఐసీఎంఆర్
చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ..దేశంలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కర్ణాటకలో ఈ కేసులు గుర్తించినట్లు పేర్కొన్నది. చైనాలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం అప్రత్తమైంది. భారత్‌లో ఆ వైరస్‌ను గుర్తించినట్లు సమాచారం. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ధారించింది.
చైనాలో వెలుగుచూస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ రకం, చిన్నారిలో గుర్తించినది ఒకటేనా, కాదా? అని తెలియాల్సి ఉన్నది. చైనాలో హ్యూమన్ మెటానిమవైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (జేఎంజీ) సమావేశం నిర్వహించింది. శీతాలకంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంవీపీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జీఎంజీ తేల్చింది. భారత్‌లో అంత ఆందోళ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.