మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు

దీంతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన హెచ్‌ఎంవీపీ కేసులు ఏడు

Advertisement
Update:2025-01-07 11:25 IST

చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) మన దేశంలోను విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు వెలుగు చూడగా.. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 7,14 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు ఏడు హెచ్‌ఎంవీపీ కేసులు నమోదయ్యాయి. సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా పేర్కొన్నారు.

దేశంలో హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ కేసులు నమోదు కావడంపై ఆందోళనల వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ వైరస్‌ కొత్తదేమీ కాదని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను 2001లో గుర్తించారు. చాలా ఏల్ఉలగా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్నది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తుంది.

శీతాకాలం, వసంత రుతువు ప్రారంభంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాలో ఈ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని.. త్వరలోనే నివేదికను మనకు షేర్‌ చేస్తుంది. ఐసీఎంఆర్‌, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌తో మన దేశంలోని శ్వాసకోశ వైరస్‌లకు సంబంధిత డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారక వైరస్‌లలో ఏ విధమైన పెరుగుదల నమోదు కాలేదు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు జనవరి 4న డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని నడ్డా పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News