హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు
సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు నిర్ధారించిన డాక్టర్లు
హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొంతుతున్నది. ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదైన విషయం విదితమే.
కొన్నిరోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తున్నది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది.
ఈ రుగ్మత బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.