కండరాల నొప్పులను ఇలా తగ్గించొచ్చు
వ్యాయామం చేసేటప్పుడు, కండరాలపై ఒత్తిడి పడినప్పుడు, తప్పు భంగిమలో నిద్రపోయినప్పుడు, ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు కండరాలు జారడం లేదా బెణకడం వల్ల నొప్పులు మొదలవుతాయి.
ఉన్నట్టుండి కండరాలు పట్టేసినట్టు అనిపిస్తుంది చాలామందికి. కండరాలు పట్టేయడం లేదా ఒత్తిడికి గురవ్వడం కారణంగా ఈ నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి నొప్పుల నుంచి రిలీఫ్ పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేసేటప్పుడు, కండరాలపై ఒత్తిడి పడినప్పుడు, తప్పు భంగిమలో నిద్రపోయినప్పుడు, ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు కండరాలు జారడం లేదా బెణకడం వల్ల నొప్పులు మొదలవుతాయి. అలాగే విటమిన్ డి, థైరాయిడ్, శరీరంలో లవణాలు లేకపోవడం,స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి కూడా కండరాల నొప్పునకు కారణమవ్వొచ్చు.
కండరాలలో నొప్పితో బాధపడేవాళ్లు ఆయా చోట్ల ఐస్ క్యూబ్‌తో మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇన్‌స్టంట్‌గా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ముఖ్యంగా భుజాలు, చేతి కండరాల నొప్పులకు ఐస్ మసాజ్ బాగా పనికొస్తుంది.
ఆవనూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా అరికాళ్లు, కాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ బాగా పనిచేస్తుంది.
మెడ, భుజాల నొప్పులు ఉన్నవాళ్లు పడుకునే విధానాన్ని మార్చాలి. మెత్తటి దిండుని వాడాలి. అలాగే ఎక్కువ సమయం ఒకే పోజ్‌లో కూర్చోకుండా చూసుకోవాలి. నొప్పులు ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
అల్లం టీ లేదా గోరువెచ్చని నీటిలో తేనె, అల్లం కలిపి తీసుకోవడం ద్వారా నొప్పుల నుంచి రిలీఫ్ పొందొచ్చ. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. కండరాల నొప్పులను తగ్గించడంలో సాయపడతాయి.
ఎక్కువగా అలసిపోవడం వల్ల ఒళ్లంతా నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీటితో స్నానం చేయడం మేలు చేస్తుంది. వేడి నీటితో స్నానం చేసి తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి.
కండరాల నొప్పులతోపాటు వాపు కూడా కనిపించినట్టయితే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.