ఫ్యాటీ లివర్‌‌ను రివర్స్ చేయండిలా!

కాలేయం చూడటానికి ఎరుపు-రంగులో ఉంటుంది. అయితే కాలేయంలో కొవ్వుశాతం పెరిగి ఉబ్బిపోయి పసుపు రంగులోకి మారితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు.

Advertisement
Update:2024-03-28 11:32 IST

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. అయితే రకరకాల కారణాల వల్ల చాలామందికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌‌గా మారుతుంటుంది. దీనివల్ల కాలేయం పనితీరు మందగించి చివరికి లివర్ ఫెయిల్ అయ్యేవరకూ వెళ్తుంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?

కాలేయం చూడటానికి ఎరుపు-రంగులో ఉంటుంది. అయితే కాలేయంలో కొవ్వుశాతం పెరిగి ఉబ్బిపోయి పసుపు రంగులోకి మారితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది దశల వారీగా జరుగుతుంది. నాలుగో దశలో లివర్ పనిచేయడం పూర్తిగా ఆగిపోయి రక్తాన్ని శుద్ధి చేయడం మానేస్తుంది. ఈ దశలో మెదడులో ట్యాక్సిన్స్ ఏర్పడి పరిస్థితి ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం‌.

కామెర్లు, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిర్లుగా అనిపించడం, అలసట వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే లివర్‌‌లో సమస్య ఉన్నట్టుగా గుర్తించాలి. తగిన పరిక్షలు చేయించి ఫ్యాటీ లివర్ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, అతిగా మద్యం సేవించడం, టైప్ 2 డయాబెటిస్, ఒబెసిటీ, థైరాయిడ్ వంటి కారణాల వల్ల రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగి ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది.

లివర్‌‌లో కొవ్వు పెరుగుతున్నట్టు గమనిస్తే వెంటనే కొన్ని డైట్ మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య ముదరకుండా జాగ్రత్తపడొచ్చు. ముఖ్యంగా లివర్ హెల్దీగా ఉండడం కోసం ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గించే పని మొదలుపెట్టాలి. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, పప్పుల వంటి ఆహారాలు అలవాటు చేసుకోవాలి.

ఇక వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్‌టీ వంటివి తాగడం, వెల్లుల్లి తీసుకోవడం కూడా మంచిదే. అలాగే రోజుకి పది నిముషాల పాటైనా కచ్చితంగా వ్యాయామం చేయడం మొదలుపెట్టాలి. లివర్ హెల్త్‌కు విటమిన్–డి ముఖ్యం. కాబట్టి దానికోసం ప్రతిరోజూ ఉదయపు ఎండలో కాసేపు గడపాలి. అలాగే డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం మర్చిపోవద్దు.

Tags:    
Advertisement

Similar News