చలికాలంలో ఈ పదార్ధాలను దూరం పెట్టండి
చలికాలంలో.. శీతలీకరణ ప్రభావాన్ని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా, శరీరానికి వేడిని అందిచే ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవాలి.
చలి కాలం మొదలయ్యింది .. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు మన శరీర రోగనిరోధక వ్యవస్ధ ప్రతిస్పందనను తగ్గిస్తాయి, వైరస్ లు విజృంభించటానికి సహకరిస్తాయి. అందుకేఈకాలంలో మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అనారోగ్యం రాకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలో చెబుతూ ఉంటారు. అయితే అనారోగ్యాన్ని తీవ్రం చేసే ఆహారాలను నివారించటంపై మాత్రం పెద్దగా వివరణ ఉండదు. ఇప్పుడు అలా శీతాకాలంలో అస్సలు తీసుకోకూడాని ఆహారాల గురించి తెలుసుకుందాం.
చలికాలంలో.. శీతలీకరణ ప్రభావాన్ని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా, శరీరానికి వేడిని అందిచే ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవాలి. అలాంటివాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది పెరుగు. అసలు పెరుగే కాదు పాల ఉత్పత్తులు అన్నింటి వాడకం తగ్గించాలి. ఎందుకంటే పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కఫానికి కారణమవుతాయి. ఇకవేళ అప్పటికే కఫం ఉంటే అది గట్టిపడటానికి దారితీస్తుంది. ఇది గొంతులో మరింత చికాకుకు పెంచుతుంది. ఆస్తమా ,ఇతర ఇన్ఫెక్షన్‌లకు గురవుతారు. అయితే తప్పదు పెరుగు తీసుకోవాలి అనుకుంటే మాత్రం పొద్దుటి సమయంలో, గది ఉష్ణోగ్రత వద్ద. లేదా వెచ్చని వంటకాలకు కలిపి తీసుకోవచ్చు.
ఈ కాలంలో వీలైనంత దూరం పెట్టాల్సినది సలాడ్స్ ని కూడా. నిజానికి సలాడ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, శీతాకాలంలో సలాడ్స్‌ను తక్కువగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సలాడ్స్‌లోని తాజా కూరగాయలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవి తింటే.. మన జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శారీరక శ్రమ చేయని వారు వాటిని తినకుండా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి జీర్ణ సమస్యలు ,బరువు పెరగడానికి, కొన్నిసార్లు అలర్జీకి కూడా కారణమవుతాయి.
చలికాలంలో నూనెలో వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి గుండెకు హాని చేస్తాయి. అసలే ఈ కాలంలో గుండె పోటు వచ్చే ఛాన్సెన్స్ 50 శాతం ఎక్కువగా ఉంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చిక్కబడుతుంది. శ్వాస నాళాలు కుదించుకుపోయినట్లే.. గుండెలోని రక్తనాళాలు కూడా ముడుచుకుపోతాయి. దీని కారణంగా గుండె సమస్యలు ఎక్కువవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.