కేవలం పచ్చి శాకాహారాలనే తిన్న ఆమె... ప్రాణాలు కోల్పోయింది
రష్యాకు చెందిన ఝన్నా శాంసోనోవా సోషల్ మీడియాలో కొంతకాలంగా పచ్చిగా తినగల శాకాహారాలు మాత్రమే మన ఆరోగ్యానికి మంచివని, అవే తినాలని బలంగా ప్రచారం చేస్తోంది.
రష్యాకు చెందిన ఝన్నా శాంసోనోవా సోషల్ మీడియాలో కొంతకాలంగా పచ్చిగా తినగల శాకాహారాలు మాత్రమే మన ఆరోగ్యానికి మంచివని, అవే తినాలని బలంగా ప్రచారం చేస్తోంది. కొన్నేళ్లుగా ఆమె పచ్చి కూరగాయలు, పళ్లు, మొలకలను మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. అయితే ఆమె నమ్మకం వమ్మయ్యింది. దురదృష్టవశాత్తూ తాను పాటించిన పద్దతి వలన పోషకాహార లోపం ఏర్పడి ప్రాణాలు కోల్పోయింది. ఝన్నా వయసు 39 సంవత్సరాలు. అసలేం జరిగిందంటే...
న్యూయార్క్ పోస్ట్ అందిస్తున్న వివరాలను బట్టి... ఝన్నా సోషల్ మీడియాలో ఝన్నా ది ఆర్ట్ అనే అకౌంట్ పేరుతో ఆహారాంశాలపై ప్రభావితం చేసే వ్యక్తిగా ప్రాచుర్యం పొందింది. పచ్చి శాకాహారాలను మాత్రమే తినటం ఆరోగ్యకరమని నమ్మిన ఝన్నా అదే పద్ధతిని కొన్నేళ్లుగా పాటిస్తోంది. ఈ క్రమంలో సరైన సంతులన ఆహారం శరీరానికి అందకపోవటం వలన గతనెల 21న ఆమె మరణించింది. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో ఉండగా ఝన్నా ప్రాణాలు కోల్పోయింది.
జంక్ ఫుడ్ చెడ్డదని భావించి...
కనీసం నాలుగేళ్లుగా ఆమె కేవలం పచ్చి ఆహారాలనే తింటున్నట్టుగా తెలుస్తోంది. పళ్లు, సన్ ఫ్లవర్ గింజల మొలకలు, పళ్ల రసాలు, స్మూతీలను మాత్రమే తీసుకుంటూ జీవించిందామె. ఝన్నా తల్లి తమ కుమార్తె కలరా వంటి వ్యాధితో మరణించిందని తెలిపింది. వైద్యులు ఇచ్చే డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దానిని బట్టి ఆమె మరణానికి అసలు కారణమేంటో తెలుస్తుందని భావిస్తున్నారు. కొన్నినెలల క్రితం శ్రీలంకలో కనిపించినప్పుడే కాళ్ల వాపుతో ఆమె చాలా నీరసంగా ఉన్నదని ఆమె స్నేహితుడు ఒకరు తెలిపారు. అతను ఆమె నివసించిన ఇంటికి పై అంతస్తులో ఉంటున్నాడు. ప్రతిరోజు ఆమె ప్రాణానికి ఏమవుతుందోనని భయం కలిగేదని, చికిత్స తీసుకోమని ఎంతగా చెప్పినా ఆమె వినలేదని అతను వాపోయాడు.
తన స్నేహితులు జంక్ ఫుడ్ తిని... తమ అసలు వయసుకంటే పెద్దవారిలా కనిపించడం చూసి ఆమె తన ఆహారంలో మార్పులు చేసుకుందని తెలుస్తోంది. ‘నా శరీరంలో మనసులో వస్తున్న మార్పుని నేను చూస్తున్నాను. నా ఈ కొత్త రూపాన్ని నేను చాలా ఇష్టపడుతున్నాను. నేను నా పాత అలవాట్లవైపు వెళ్లనిక’ అంటూ ఉండేదట ఝన్నా. కానీ తను ఎంపిక చేసుకున్న ఆహార విధానం ఆమెకు మేలు చేయకపోగా ప్రాణాలకే ముప్పు తెచ్చింది.
కేవలం పచ్చివే తింటే పోషకాల లోపం
ఆయుర్వేదం చెబుతున్నదాన్ని బట్టి పళ్లు, గింజలు, విత్తనాలు వంటివాటిని పచ్చివిగా తినేందుకు అవకాశం ఉన్నా పూర్తిస్థాయిలో పచ్చి ఆహారాలే తినటం మన శరీరానికి అంత మంచిది కాదు. పళ్లు, గింజలు, విత్తనాలతో పాటు వండుకుని తినే ఆహారాలు సైతం తీసుకోవాలి. వాటివలన పొట్టకి రక్తప్రసరణ మెరుగై, జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. వండిన ఆహారాన్ని మన పొట్ట తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. అలాగే పోషకాలను బాగా శోషించుకుంటుంది.
పచ్చిగా తినగల ఆహారాలు బరువు తగ్గిస్తాయని, గుండె ఆరోగ్యానికి మంచివని, మధుమేహం ముప్పుని నివారిస్తాయని చాలామంది భావిస్తుంటారు. నిజమే... పచ్చివిగా తినగల శాకాహారపు ఆహారాలు శరీరంలో కొవ్వు శాతాన్ని, రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి ఆహారాలు మాత్రమే తినటం వలన పోషకాల లోపం ఏర్పడే ప్రమాదం ఉందని మర్చిపోకూడదు. తాము పాటించే ఆహార పద్ధతుల వలన శరీర ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే బి12, డి విటమిన్లు, సెలీనియం, జింక్, ఐరన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంది. కొన్నిరకాల పచ్చి ఆహారాలు వండినవాటికంటే ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ... కొన్నిరకాల పచ్చి ఆహారాలు మన శరీరంలో నరాల వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచే థయామిన్ ని 22శాతం వరకు తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఉడికించిన కూరగాయలు మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను మరింత ఎక్కువగా ఇస్తాయి.
ఆహార పద్ధతులను పాటించేటప్పుడు వాటిలో ఉన్న మంచిచెడులను గురించి ఆరోగ్య ఆహార నిపుణులను అడిగి తెలుసుకోవటం మంచిది. అన్ని పోషకాలు తగిన పాళ్లలో ఉండేదే ఆరోగ్యకరమైన ఆహార విధానమని గుర్తుంచుకోవాలి.