డిప్రెషన్ తో డయాబెటిస్ వస్తుందా?
మానసిక అనారోగ్యాలు శరీరంపైన ప్రభావం చూపి శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంటాయి. డయాబెటిస్ యుకె అనే ఛారిటీ సంస్థ నిధులు సమకూర్చి నిర్వహించిన ఓ నూతన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
మానసిక అనారోగ్యాలు శరీరంపైన ప్రభావం చూపి శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంటాయి. డయాబెటిస్ యుకె అనే ఛారిటీ సంస్థ నిధులు సమకూర్చి నిర్వహించిన ఓ నూతన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది. డిప్రెషన్ వలన టైప్ టు మధుమేహం వస్తుందని, ఈ రెండు అంశాలకు నేరుగా సంబంధం ఉన్నదని ఈ అధ్యయనంలో తేలింది. డిప్రెషన్ కి గురయినవారికి చికిత్స చేసేటప్పుడు వారిలో మధుమేహం వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనే విషయాన్ని అంచనావేయటం మంచిదని, దీనివలన వారు డయాబెటిస్ కి గురికాకుండా నివారించే అవకాశం ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు...
ఇంతకుముందు నిర్వహించిన పరిశోధనల్లో టైప్ టు డయాబెటిస్ ఉన్నవారికి డిప్రెషన్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. అలాగే డిప్రెషన్ తో బాధపడేవారికి టైప్ టు మధుమేహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రస్తుత అధ్యయనంలో చాలా స్పష్టంగా తేలింది. అయితే డిప్రెషన్, టైప్ టు డయాబెటిస్... ఈ రెండింటిలో ఏది మరొకదానికి కారణమవుతోంది... లేదా ఈ రెండింటినీ కలుపుతున్న ఇతర అంశాలేమైనా ఉన్నాయా అనే విషయంలో ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదు.
ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న అధ్యయనాన్ని యుకె, ఫిన్లాండ్ లకు చెందిన వేలమందిపై నిర్వహించారు. ఇందులో జన్యుపరమైన, ఆరోగ్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిప్రెషన్ కి, మధుమేహానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో తొలిసారిగా పరిశోధకులు డిప్రెషన్ వలన టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నదని గుర్తించారు. అధిక శరీర బరువు కూడా డిప్రెషన్ ప్రభావాన్ని మరింత పెంచి మధుమేహం వచ్చేందుకు కొంతవరకు దోహదం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అలాగే టైప్ టు డయాబెటిస్, డిప్రెషన్... రెండింటికి కారణమవుతున్న ఏడు రకాల జన్యువులను సైతం పరిశోధకులు గుర్తించారు. డిప్రెషన్ ఏ విధంగా టైప్ టు డయాబెటిస్ కి కారణమవుతున్నదనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా ఊబకాయం, శారీరక వ్యాయామం లేకపోవటం లాంటి అంశాలు రెండింటిపైనా ప్రభావం చూపుతున్నాయని మాత్రం పరిశోధకులు చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారిలో రోజువారీ జీవితంలోని పనులు భారంగా మారి అదే డిప్రెషన్ కి దారితీయవచ్చని పరిశోధకులు అంటున్నారు.
నూతన అధ్యయన ఫలితాల వలన డిప్రెషన్ తో బాధపడుతున్నవారిపై మరింత శ్రద్ధ చూపించి వారు మధుమేహానికి గురికాకుండా నివారించే అవకాశం పెరిగిందని డయాబెటిస్ యుకె కి చెందిన డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్ సన్ అన్నారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు టైప్ టు డయాబెటిస్ ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నప్పటికీ... టైప్ వన్ డయాబెటిస్ ఉన్నవారు కూడా డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని డయాబెటిస్ యుకె సంస్థ పేర్కొంది. అయితే డిప్రెషన్... టైప్ టు డయాబెటిస్ కి దారితీసినట్టుగా.... టైప్ వన్ డయాబెటిస్ కి కారణం కాదని మాత్రం శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే టైప్ వన్ డయాబెటిస్ రోగనిరోధక వ్యవస్థలోని సమస్యల కారణంగా వస్తుంది.