పిల్లలకు కీళ్లనొప్పులు ఉంటే...

పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ ఉన్నపుడు తీవ్రమైన కీళ్ల నొప్పులు, జాయింట్లు స్టిఫ్ గా మారిపోవటం, కదలికలు కష్టంగా మారటం లాంటి లక్షణాలు ఉంటాయి.

Advertisement
Update:2023-08-02 00:13 IST

సాధారణంగా కీళ్లనొప్పులు పెద్ద వయసు వారిలోనే వస్తుంటాయి. అయితే చిన్నపిల్లల్లో కూడా కీళ్ల వాపు, నొప్పులు వచ్చే అవకాశం ఉంది. పదహారేళ్లలోపు పిల్లల్లో కనిపించే కీళ్ల వాపు మంట నొప్పులు లాంటి లక్షణాలతో కూడిన వ్యాధిని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. మనదేశంలో ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి గురయినవారిలో కీళ్లలో విపరీతమైన నొప్పి, అసాధారణ పెరుగుదలలు, కీళ్లు తమ సాధారణ రూపంలో లేకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. త్వరగా గుర్తించడం ద్వారా ఈ సమస్యనుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీళ్లు దెబ్బతినకుండా, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తకుండా కాపాడుకోవచ్చు. సరైన సమయంలో సమస్యని గుర్తించిప్పుడు వైద్యులు మరింత సమర్ధవంతంగా చికిత్సని అందించగలరు. మందులు, శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో జువెనైల్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

లక్షణాలు

పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ ఉన్నపుడు తీవ్రమైన కీళ్ల నొప్పులు, జాయింట్లు స్టిఫ్ గా మారిపోవటం, కదలికలు కష్టంగా మారటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యల వలన వారి రోజువారీ పనులుకూడా కష్టతరంగా మారతాయి. నడక, వస్తువులను పట్టుకోవటం, తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతో ఆనందించడం లాంటివి చేయలేరు. అలాగే శారీరక ఇబ్బందులతో పాటు మానసికంగా కూడా వీరు సవాళ్లను ఎదుర్కొంటారు. జువెనైల్ ఆర్థరైటిస్ తో కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ వంటి ఇతర భాగాలు కూడా ప్రభావితం అవుతాయి. చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ ఉంటే తల్లిదండ్రులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో కీళ్లవాపు లక్షణాలు ఉండి కనుక్కోలేకపోతే ఎముకలకు, జాయింట్లకు తీవ్రమైన హాని జరిగే అవకాశం ఉంది.

చికిత్స-జాగ్రత్తలు

పిల్లలకు కీళ్లవ్యాధి ఉన్నట్టుగా తేలితే తల్లిదండ్రులు చికిత్స విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలి. చిన్నపిల్లల వైద్య నిపుణులు, రుమటాలజిస్ట్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, ఇతర ప్రత్యేక నిపుణుల చికిత్స, సలహాలు, పర్యవేక్షణల సహాయంతో వ్యాధికి తగిన మందులను వాడాల్సి ఉంటుంది. నిరంతరం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండటం వలన వ్యాధి పెరుగుతున్నపుడు దానికి అనుగుణంగా చికిత్స ని మార్చే అవకాశం కూడా ఉంటుంది.

 బాధితులైన పిల్లలు మందులను సరిగ్గా తీసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. మందులు తీసుకోకపోతే మంట నొప్పి లక్షణాలు పెరుగుతాయి. మందులతో పాటు తగిన పోషకాహారం కూడా ఇవ్వాలి. దీనివలన ఎముకల ఆరోగ్యంతో పాటు పూర్తి స్థాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

♦ కీళ్ల నొప్పులున్నపుడు శారీరక వ్యాయామం కూడా అవసరం. వైద్యుల సలహా మేరకు తేలిక పాటి వ్యాయామాలు చేయించడం వలన కీళ్ల కదలికలు సులువుగా మారతాయి. అలాగే కండరాలు బలోపేతమవుతాయి.

♦ కీళ్ల వ్యాధులున్న పిల్లలు మానసికంగా బాధకు వ్యధకు గురికాకుండా వారికి భావోద్వేగపరమైన అండగా నిలబడాలి. వారి స్నేహితులు, స్కూల్ టీచర్లు, క్లాస్ మేట్స్ కూడా వారి బాధని అర్థం చేసుకుని తోడ్పడేలా చూడాలి.

Tags:    
Advertisement

Similar News