కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. తెలిస్తే పక్కన పెట్టకుండా తినేస్తారు
కరివేపాకును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పిండి పదార్థాలు, ఫైబర్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్లు ఉండటంతో దీన్ని ఆరోగ్య ప్రదాయినిగా చాలా మంది చెబుతుంటారు.
'కూరలో కరివేపాకు'లా తీసేశాడు.. అనే నానుడి ఊరికే రాలేదు. చాలా మంది అన్నం తినే సమయంలో కూరలో కరివేపాకు వస్తే పక్కకు పెడతారు. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వచ్చినా కనీసం అన్నంలో కలిపి తినేస్తారు. కానీ, కరివేపాకును మాత్రం నోటి దగ్గరకు రానివ్వరు. ఇంట్లో చాలా మంది కరివేపాకును తినరు అని తెలిసినా.. వంటల్లో మాత్రం దాన్ని తప్పకుండా ఉపయోగిస్తూనే ఉంటారు. కూరలకు కమ్మటి వాసన, రుచిని అందిస్తుంది కాబట్టే కరివేపాకు ప్రతీ ఇంటిలో ఉంటుంది.
కరివేపాకును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పిండి పదార్థాలు, ఫైబర్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్లు ఉండటంతో దీన్ని ఆరోగ్య ప్రదాయినిగా చాలా మంది చెబుతుంటారు. గుండెను కాపాడేందుకు కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కూడా కరివేపాకు సాయం చేస్తుంది. కర్రీ లీవ్స్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరానికి మేలు చేస్తాయి. జీర్ణ క్రియ మెరుగు పడటంతో పాటు లివర్ డ్యామేజ్ కాకుండా కరివేపాకు రక్షణ కల్పిస్తుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండే వారు కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే కొయినిజన్ అనే రసాయనం డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. మరోవైపు ఇందులో ఉండే హైపో గ్లైసెమిక్ లక్షణాలు షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కడుపులో నొప్పిగా ఉంటే రెండు రెబ్బల కరివేపాకు తింటే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలకి సహాయపడుతుండటంతో కడుపు నొప్పి కూడా మాయం అవుతుంది. ఆహారం జీర్ణం అయ్యేందుకు అవసరమయ్యే ఎంజైమ్‌లను ప్రోత్సహించి.. విరోచనాలు, మలబద్ధక సమస్యను కరివేపాకు నివారిస్తుంది.
కరివేపాకుతో చేసిన జ్యూస్‌లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగడం వల్ల యూరినరీ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా సవ్యంగా జరుగుతుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంగా ఉండటం వల్ల కరివేపాకు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడి కొవ్వు కరిగిపోతుంది.
కరివేపాకు తినడం వల్ల జుట్టుకు మేలు కలుగుతుంది. చాలా మంది కరివేపాకును గ్రౌండ్ చేసి జుట్టుకు పెట్టుకుంటారు. దీని వల్ల జట్టు నాణ్యత మెరుగు పడటంతో పాటు బలంగా మారుతుందని అనుకుంటారు. జుట్టుకు పెట్టుకోవడం కంటే తినడం వల్ల మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన జట్టుకు కుదుళ్ల నుంచి పోషకాలు అందుతాయని అంటున్నారు.
గర్భిణీ స్త్రీలు తరచుగా మార్నింగ్ సిక్ నుంచి కరివేపాకు కాపాడుతుంది. వాంతులు, వికారంగా అనిపిస్తే కరివేపాకు కాస్త నమిలితే ఉపశమనం ఉంటుంది. మొత్తానికి కరివేపాకు వల్ల లాభాలే కాని నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇకపై ప్లేట్‌లోని కరివేపాకును పక్కన పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.