రేపటి నుంచి వారాహి పార్ట్-2.. మన కష్టం వృథా కాదంటున్న పవన్
వారాహి యాత్రతో ఏపీ రాజకీయాల్లో ఈసారి మన ముద్ర బలంగా పడుతుందనే నమ్మకం తనకు కలిగిందన్నారు పవన్ కల్యాణ్. యాత్ర రెండో భాగం కూడా గోదావరి జిల్లాల్లోనే ఉంటుందన్నారు.
వారాహి యాత్ర పార్ట్-2 రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, యాత్ర జరిగే ప్రాంతాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏర్పాట్లపై చర్చించారు. మన కష్టం వృథా కాదంటూ వారికి ఉపదేశమిచ్చారు. వారాహి యాత్రకోసం, ప్రజల్లో మార్పుకోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ ఫలితం ఉంటుందని, అందర్నీ గుర్తు పెట్టుకుంటామని, అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
బలమైన ముద్ర..
వారాహి యాత్రతో ఏపీ రాజకీయాల్లో ఈసారి మన ముద్ర బలంగా పడుతుందనే నమ్మకం తనకు కలిగిందన్నారు పవన్ కల్యాణ్. యాత్ర రెండో భాగం కూడా గోదావరి జిల్లాల్లోనే ఉంటుందన్నారు. గోదావరి నుంచే మార్పు రావాలని, వైసీపీ విముక్త ఏపీకోసం అందరూ కృషి చేయాలన్నారు. ప్రజా కంటక పాలననుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని, ఆ బాధ్యత జనసేనపై ఉందన్నారు.
యాత్ర షెడ్యూల్ ఇదే..
ఈ నెల 9నుంచి అంటే రేపటినుంచే వారాహి రెండో దశ యాత్ర మొదలవుతుంది. రేపు(ఆదివారం) ఏలూరులో యాత్ర చేపట్టి, సాయంత్రం 5 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో బహిరంగ సభలో పాల్గొంటారు పవన్. ఈనెల 10న మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరులో జనవాణి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్ భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి గూడెం చేరుకుంటారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఉంటుంది.