నేను, నాని కలిసి వాళ్ల డొక్క పగలదీస్తాం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

నేను, నానీ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా డీల్ చేసుకోగలం.. డొక్క పగలదీస్తాం.. కచ్చితంగా మేమేమిటో చేసి చూపిస్తామని గన్నవరం ఎమ్మెల్యే వంశీ హెచ్చరించారు.

Advertisement
Update:2023-02-02 12:06 IST

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తుంటే.. తాజాగా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో మరో వివాదం మొదలైంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నానీలపై ఆ పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ అంటూ వెంకట్రావు తీవ్ర పదజాలంతో తిట్టారు. వల్లభనేని వంశీ ఏం వ్యాపారం చేసి ఇన్ని కోట్లు సంపాదించాడని యార్లగడ్డ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా వంశీ స్పందించారు.

'నేను మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నామినేషన్ వేసినప్పుడు నా ఆస్తులేంటో అఫిడవిట్‌లో చెప్పాను. నా ఐటీ లెక్కలు కూడా జత చేశాను. కళ్లుండి చూడగలిగిన వాళ్లు అవి చూస్తే నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. అవి ఎట్లా వచ్చాయో తెలుస్తుంది. దుట్టా, యార్లగడ్డ ఇద్దరినీ విడివిడిగా ఓడించా.. గుంపులుగా వచ్చినా ఓడించాను. ఎవరో పనికి మాలిన వాళ్లు, పని లేని వాళ్లు.. ఊరికే కూర్చొని ఏది బడితే అది మాట్లాడితే.. దానికి సమాధానం చెప్పుకుంటూ పోతే మా జీవిత కాలం సరిపోదు. ఎవరు అవునన్నా కాదన్నా నేను గన్నవరం ఎమ్మెల్యేని.. 2024 వరకు నేనే ఉంటా' అని వంశీ అన్నారు.

'ఇప్పటికే వారు చేసిన వ్యాఖ్యలు ఇంటెలిజెన్స్ ద్వారానో, మీడియా ద్వారానో అధిష్టానికి తెలిసే ఉంటుంది. మేము ప్రత్యేకంగా వారికి చెప్పాల్సిన పని లేదు. పార్టీ పరంగా ఏం చేయాలో హైకమాండ్ చూసుకుంటుంది. కానీ ఇది నాకు, నానీకి కానీ వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసింది. కాబట్టి మా క్యారెక్టర్‌ను కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాం' అని వంశీ వెల్లడించారు. వాళ్లిదర్దూ తనకు ఏనాడూ సహకరించలేదు, అయితే నేను వైసీపీలోకి వచ్చాను కాబట్టి వారిని కలుపుకొని పోవాలని ప్రయత్నించాను. కానీ వీళ్లు మాత్రం దూరంగానే ఉన్నారని వంశీ అన్నారు.

నాకు రాజకీయ వారసులు లేరని.. నా పదవిని ఆశించే కూతురో, కొడుకో, కోడలో, అల్లుడో, కాటికి కాలు చాపిన వారో లేరని చెప్పారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు నన్ను దీవించారు, ఓటేశారు కాబట్టి వారికి సేవ చేయడమే లక్ష్యం అన్నారు. ఊర్లో తాడి చెట్టూ పెరుగుతుందీ.. మనిషి పెరుగుతాడు, వయసుకు ఒక జ్ఞానం విజ్ఞత ఉండాలి. నేను చాలా ఓపికతో సహనంతో ఉన్నాను. నా మీద విమర్శలు చేసిన వెధవలను అడ్డగాడిదలను వాళ్ల సంస్కారానికే వదిలేస్తున్నానని వంశీ ఘాటుగా చెప్పారు.

నేను, నానీ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా డీల్ చేసుకోగలం.. డొక్క పగలదీస్తాం.. కచ్చితంగా మేమేమిటో చేసి చూపిస్తామని గన్నవరం ఎమ్మెల్యే వంశీ హెచ్చరించారు. కాగా యార్లగడ్డ, దుట్టా వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంకా స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News