అడిగి మరీ తిట్టించుకుంటున్న ఏపీ మంత్రులు!

ముఖ్యంగా తెలంగాణ నాయకుల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న మీ రాజధాని ఏది..? రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ రాజధాని కట్టుకోలేని ఆంధ్ర నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Update:2023-07-14 17:31 IST

మన ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని పొరుగు ఇంటి గురించి మాట్లాడితే బాగుంటుంది. మనకే లెక్కలేనన్ని సమస్యలు పెట్టుకొని పక్క వారి గురించి మాట్లాడినప్పుడు వారు మాట్లాడే మాటలకు మ‌న‌కు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విషయం కరెక్ట్‌గా ఆంధ్ర మంత్రులకు వర్తిస్తుంది. ఎన్నికలకు చివరి ఆరు నెలల ముందుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పై నోరు జారిన మంత్రి బొత్స సత్యనారాయణకి తెలంగాణ మంత్రులు, నాయకుల నుంచి వ‌స్తున్న‌ ప్రశ్నలకు ఆయ‌న‌ దగ్గర సమాధానాలు ఉన్నాయా అనేది అస‌లు ప్రశ్న?.

ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీరా ఎన్నికల ముందు ఏదో పెద్ద నోటిఫికేషన్ ఇస్తున్నట్లు మాట్లాడుతూ తెలంగాణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లు టీఎస్పీఎస్సీ ప‌రీక్ష‌లు కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారని, అన్ని చూచి రాతలు.. స్కామ్‌లు జరుగుతున్నాయని, చివరికి ఉపాధ్యాయుల బదిలీలు కూడా సరిగ్గా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ నోరు పారేసుకున్నారు ఏపీ మంత్రి బొత్స‌. దీనికి వెంటనే తెలంగాణ మంత్రులు కూడా అదే స్థాయిలో రిప్ల‌య్‌ ఇవ్వడంతో ఆయ‌న‌ డైలమాలో పడ్డారు.

ముఖ్యంగా తెలంగాణ నాయకుల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న మీ రాజధాని ఏది..? రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ రాజధాని కట్టుకోలేని ఆంధ్ర నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం ఇవ్వడానికి టీడీపీ గానీ, వైసీపీ గానీ ధైర్యం చేసే పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఇరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాజ‌ధాని అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతూ రాజకీయం చేస్తున్నారు. రాజ‌ధాని క‌ట్ట‌కుండా ఒక‌రు అమ‌రావతినే కావాలంటుంటే.. మ‌రొక‌రు మూడు రాజ‌ధానులు అంటుంటే.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల నేత‌లంద‌రూ మీ రాజ‌ధాని పేరు చెప్ప‌మని కామెడీలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

మ‌రీ ముఖ్యంగా చిన్న జబ్బు చేసిన‌ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ తెలంగాణలకు వచ్చే ఆంధ్ర నాయకులు.. హైదరాబాదులోని కార్పొరేట్ స్కూళ్ల‌ల్లోనూ, కాలేజీల్లోనూ చదివే ఆంధ్ర విద్యార్థుల గురించి తెలంగాణ వారు ప్రశ్నిస్తే వారి ద‌గ్గ‌ర‌ సమాధానం ఉందా..? అక్కడ ఉండే స్కూల్స్, హాస్పిటల్స్ గురించి చెప్పాలంటే హైద‌రాబాద్‌కు వ‌చ్చే విద్యార్థుల‌ను, రోగుల‌ను చూస్తే అర్థం అవుతుంది. అందులో ముఖ్యంగా నిత్యం శని, ఆదివారాల్లో హైదరాబాదులో గడిపే నాయకులు తెలంగాణ‌ అభివృద్ధి గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా కొన్ని కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయి.. వాటిని ఆ రాష్ట్రాలు, ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్షాలు చూసుకుంటాయి. అంతే త‌ప్ప వారి మ‌ధ్య‌లోకి ఎవ‌రైనా దూరితే వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పుకోలేక బిక్క మొహం పెట్టుకోవాల్సి వస్తుంది.

అయినా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహంగా ఉంటూ ఎవరు పని వారు చేసుకుంటూ ఉంటే కొంద‌రు మంత్రులు మాత్రం అప్ప‌డ‌ప్పుడు పక్క రాష్ట్రాలపై రెచ్చగొట్టిన‌ట్లు మాట్లాడుతున్నారు. వీరి మాట‌ల్లోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి కంటే త‌ప్పులే ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో ఇరువురు ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌తిప‌క్షాల‌కు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికైనా ఏ రాష్ట్రంలోని వారు ఆ రాష్ట్రం గురించి ఆలోచిస్తే మరోసారి అధికారంలోకి రావ‌చ్చు. లేదు పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తాము అంటే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News