పార్టీ మార్పు వార్తలపై విజయసాయి క్లారిటీ..
తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం పెద్ద దుమారంగా మారింది. ఆల్రడీ ఇద్దరు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నారని, మరో నలుగురు కూడా అదే బాటలో ఉన్నారని, వారంతా టీడీపీ లేదా బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ వార్తలపై స్పందించడం విశేషం. ఫలానా వారికి పార్టీ ఎంతో చేసిందని, వారు పార్టీ మారతారని తాను అనుకోవడం లేదని అంబటి చెప్పారు. అంటే నిప్పు లేకుండా పొగ రాలేదని అంబటి ఒప్పుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు.
తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పుకున్నారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు. తాను వైసీపీని వీడుతున్నానని, వేరే పార్టీలో చేరుతున్నానని ఓ వర్గం మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ వార్తల్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి.
ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి, తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు కూడా వైసీపీని వీడబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయా నాయకులు ఖండించకపోవడం విశేషం. మరికొన్ని చేరికలకు కూడా టీడీపీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసిన వారికే టీడీపీలో అవకాశం ఉంటుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఈ క్రమంలో తనపై వచ్చిన పుకార్లకు ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు.