సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటన
సంక్రాంతి పండగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. జనవరి 8 నుంచి మొదలు 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.
తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఎండీ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలుండవని, సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.