ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలిగిస్తాం
జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి
ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా చెప్పారు. తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలిగిస్తాం. ఆయా కాలేజీలు ఇంటర్నల్‌గా ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందని కృతికా శుక్లా తెలిపారు. 2025-26 ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడుతామన్నారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందన్నారు.
15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్టు కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తాం. ఇందులో భాగంగా మొదటి సంవత్సర పరీక్షలు తొలిగిస్తామన్నారు. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచామని కృతికా శుక్లా తెలిపారు.