సమస్యల పరిష్కారానికి 'జన నాయకుడు' పోర్టల్
కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు
కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు.
ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదుల రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ఫిర్యాదుల స్వీకరణకు జన నాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, తమ ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేయవచ్చు. వాట్సప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చు. వాటిని పోర్టల్‌లో నమోదు చేసి విశ్లేషించి పరిష్కారం చూపుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం విషయంలో నాపై ప్రత్యేక బాధ్యత ఉన్నది. ఇక్కడి ప్రజలు వరుసగా 8 సార్లు గెలిపించారు. సీఎంగా ఉన్నందున అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఏ అర్జి వచ్చినా నిర్దిష్ట సమయంలో పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. ఇది వినూత్న ప్రయోగం అని చంద్రబాబు అన్నారు.