నన్ను బూతులు తిట్టాడు, అందుకే కొట్టా..

ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, తనని బూతులు తిట్టడం వల్లే చేయి చేసుకున్నానని చెప్పారు ఎమ్మెల్యే శివకుమార్.

Advertisement
Update:2024-05-13 18:15 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా నిలబడటమే తప్పా..? కమ్మ కులంలో పుట్టిన వారు ఇంక ఏ పార్టీలోనూ ఉండకూడగదా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెనాలి ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. ఈరోజు ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణపై ఆయన వివరణ ఇచ్చారు. తనను బూతులు తిట్టినందుకే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు క్యూ లైన్లో వెళ్లి ఓటు వేయడం ఎక్కడైనా చూశారా అని అన్నారు. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా క్యూలైన్ లో వెళ్లలేదని, కావాలని తననే టార్గెట్ చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే శివకుమార్.


అసలేం జరిగింది..?

ఏపీలో ఈరోజు తెనాలి పోలింగ్ బూత్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్యూలైన్ తప్పించి ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు ఓటు వేయడానికి వెళ్లారు. ఓ సామాన్య ఓటర్ వారిని అడ్డుకున్నారు. ఆవేశంలో ఎమ్మెల్యే ఆ ఓటరుపై చేయి చేసుకున్నాడు. ఇంతవరకు జరిగితే అదిసంచలనం అయ్యేది కాదు. ఆ తర్వాత ఆ ఓటరు కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడంతో ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఆ వ్యక్తిని కొట్టడంతో పోలీసులు వారిని పక్కకు తీశారు. ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, తనని బూతులు తిట్టడం వల్లే చేయి చేసుకున్నానని చెప్పారు ఎమ్మెల్యే శివకుమార్. సదరు ఓటరు బెంగళూరు నుంచి వచ్చారని, మందు తాగి ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించే ఎమ్మెల్యే అంటూ తనను దూషించారని, అందుకే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈసీ ఆగ్రహం..

మరోవైపు ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News