మంత్రి అమర్నాథ్ కంటతడి.. సీటు పోయినందుకేనా..?
ఒకవేళ అమర్నాథ్ కి సీటు ఇవ్వకపోతే ముందు చెప్పినట్టుగా జెండా భుజాన మోస్తూ కార్యకర్తలా పనిచేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.
ఏపీలో ఇన్ చార్జ్ ల మార్పు వ్యవహారంపై ఇటీవల మంత్రి అమర్నాథ్ కాస్త గట్టిగానే బదులిచ్చారు. సీటిచ్చినా, ఇవ్వకపోయినా తామంతా సీఎం జగన్ వెంటే ఉంటామన్నారు. జగన్ ఆదేశిస్తే పోటీకి దూరమై కార్యకర్తగా జెండాపట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతానని కూడా చెప్పారు. అక్కడ సీన్ కట్ చేస్తే మరుసటి రోజు విడుదలైన సెకండ్ లిస్ట్ లో మంత్రి అమర్నాథ్ నియోజకవర్గం అనకాపల్లికి ఇన్ చార్జ్ గా మలసాల భరత్ ని ప్రకటించారు. పోనీ అమర్నాథ్ కి కొత్త నియోజకవర్గం కేటాయించారా అంటే అదీ లేదు. దీంతో ఆయనకు షాక్ తగిలిందని వైరి వర్గాలంటున్నాయి. అబ్బే అదేం లేదు ఆయనకు మరో నియోజకవర్గాన్ని కేటాయిస్తారనే ప్రచారం కూడా వైసీపీలో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాలు ఎలా ఉన్నా.. సెకండ్ లిస్ట్ విడుదలైన తర్వాత బహిరంగ వేదికపై మంత్రి కంటతడి పెట్టుకోవడం మాత్రం విశేషం.
సీటు మార్చినందుకా..? లిస్ట్ లో పేరు లేనందుకా..?
సహజంగా మంత్రి స్థాయి వ్యక్తికి సీటు మార్చే సమయంలో ఆ స్థాయిలోనే ప్రకటనలుంటాయి. మంత్రికి ప్రత్యామ్నాయంగా కొత్తవారిని తెచ్చినప్పుడు సదరు మంత్రికి మరో సీటు ఆఫర్ చేస్తారేమోననే అంచనాలున్నాయి. పోనీ ఆ ప్రకటన లేటయినా.. ముందుగా అమర్నాథ్ కి ఫలానా నియోజకవర్గం అనే హింట్ అయినా ఇస్తారేమో అనుకున్నారు. కానీ రెండూ లేవు. లిస్ట్ లో ఆయన పేరు లేదు, ఆయనకు కొత్తగా ఇచ్చే నియోజకవర్గంపై కనీసం సమాచారం కూడా లేదు. దీంతో అమర్నాథ్ హర్ట్ అయ్యారనేది వైరివర్గం వాదన. దీనికి బలం చేకూరుస్తూ ఆయన నిండు సభలో కంటతడి పెట్టుకున్నారు. అయితే తన బాధకు ఆయన చెప్పిన కారణం వేరే ఉందట.
సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారని అంటున్నారు అనుచరులు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని కూడా ఆయన సభలో చెప్పడం విశేషం. ఒకవేళ అమర్నాథ్ కి సీటు ఇవ్వకపోతే ముందు చెప్పినట్టుగా జెండా భుజాన మోస్తూ కార్యకర్తలా పనిచేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.