అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోం
మీడియా చిట్ చాట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా ఊరుకోబోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అధికార వ్యవస్థ చిందర వందర చేశారని.. దానిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారని, వాళ్ల వద్దకు వెళ్తేనే కదా సమస్యలేమిటో తెలిసేది అన్నారు. నెలలో 14 రోజుల్లో జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. మంత్రిగా పేషిలో కూర్చోవడం కన్నా ప్రజల్లోకి వెళ్తేనే మంచిది కదా అన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కోసారి అధికారులతో 14 గంటల పాటు రివ్యూ మీటింగులు పెడతారని, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ సక్రమంగా పనిచేయాలన్నారు. అద్భుతంగా పని చేస్తే 8 గంటలు చేసినా సరిపోతుందన్నారు. గత ఐదేళ్లలో లంచాలు లేకుండా బదిలీలు చేయలేదని, ఏ పని చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనన్న పరిస్థితి తీసుకువచ్చారన్నారు. మెరిట్ ఆధారంగా చేయాల్సిన బదిలీలను డబ్బులు తీసుకొని చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు.
పేర్ని నాని చేసిన తప్పులే ఇప్పుడు ఆయన ఇంట్లో వాళ్లను రోడ్డు మీదికి తెచ్చాయన్నారు. అప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను బూతులు తిట్టి ఇప్పుడు నీతులు వళ్లిస్తే ఎట్లానని ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాయం అయ్యింది నిజమని.. వాటికి డబ్బులు కట్టింది కూడా వాస్తవమేనని చెప్పారు. రాజకీయాల్లోకి ఇంట్లో వాళ్లను తీసుకొస్తున్నారని మాట్లాడుతున్నారని.. ఇంట్లో వాళ్ల పేరుతో గిడ్డంగి నిర్మించింది ఎవరో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం కన్నా తమ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఆరు నెలలకు తమ పాలనలో ఆరు నెలలకు పోల్చి చూసుకుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాని నరేంద్రమోదీ కల అని.. తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, పర్యవరణ పరిరక్షణపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.