ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై చర్చించారు. ముఖ్యంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకలం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. రైతులు, మత్స్యకారులకు ఇచ్చే రూ.20వేల ఆర్థిక సాయంపైనా చర్చ జరిగింది. రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు రూ.20వేలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు.
వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు రూ.20వేలు చెల్లించే విషయంపైనా మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు అన్నారు. ఈనెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, రోడ్‌షో విజయవంతం చేసేందుకు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులను అందించేందుకు కూటమిప్రభుత్వం సిద్ధం అయింది. పథకానికి సంబంధించిన విధి, విధానాలు త్వరలోనే ఖరారు చేయాలని చేయనున్నాది. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు బిగ్ రిలీఫ్ ఉంటుంది. ప్రతీ విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.