కన్నా, రాయపాటిలను పిలిచి కేసు కొట్టేసిన న్యాయమూర్తి
అప్పటి నుంచి 12ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. ఇప్పటికే రాయపాటి చేసిన అసత్య ఆరోపణలపై కన్నా లక్ష్మీనారాయణ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. రాయపాటి తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సి ఉంది.
కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు. వీరి మధ్య వైరం ఇప్పటిది కాదు. ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నా సరే ఉప్పునిప్పులాగే ఉండేవారు. ఒకవిధంగా బద్ధశత్రువుల తరహాలో వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఇద్దరూ అంత ఎఫెక్టివ్‌గా లేరు. రాయపాటికి వయసు మీద పడింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.
వీరి రాజీకి న్యాయమూర్తి కూడా చొరవ చూపారు. 2010లో మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కోటి రూపాయలకు పరువు నష్టం దావాతో పాటు భవిష్యత్తులో మరోసారి అలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కన్నా లక్ష్మీనారాయణ కోర్టును ఆశ్రయించారు.
అప్పటి నుంచి 12ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. ఇప్పటికే రాయపాటి చేసిన అసత్య ఆరోపణలపై కన్నా లక్ష్మీనారాయణ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. రాయపాటి తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సి ఉంది. కేసు ఈ దశలో ఉండగా గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రామ్ గోపాల్.. ఇరువురికి కొన్ని సూచనలు చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్ నేతలైన మీరే.. ఇలా చిన్నచిన్న విషయాలకు పరువు నష్టం దావాలు వేసుకుని కోర్టుకు రావడం ద్వారా ఇతరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోండి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రాజీ పడి కేసును సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. అలాంటి అవకాశం ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత ఇరుపక్షాల న్యాయవాదులు కూడా మాట్లాడుకున్నారు. చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకునేందుకు రాయపాటి అంగీకరించారు. దాంతో కన్నా కూడా రాజీకి ఓకే చెప్పారు. కేసులో రాజీ పడుతున్నట్టు ఇరుపక్షాలు మెమో దాఖలు చేశాయి. అనంతరం న్యాయమూర్తి ఇరువురు నేతలను తన చాంబర్‌కు పిలిచి రాజీ కుదిర్చి కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.