మళ్లీ బెంగళూరుకి జగన్.. అయితే ఏంటి..?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్లంటూ గతంలో వైసీపీ నేతలు విమర్శించేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అవే ప్రశ్నలు వేస్తోంది. పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటోంది.
జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లారు. 40రోజుల వ్యవధిలో ఇది నాలుగో పర్యటన. వారం రోజుల క్రితమే ఆయన బెంగళూరు నుంచి తిరిగొచ్చారు, మళ్లీ ఇప్పుడు అక్కడికే వెళ్లారు. టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాల్ని హైలైట్ చేస్తూ వార్తలిస్తోంది. జగన్ బెంగళూరు పర్యటనలో వింత, విశేషం ఏమీ లేదు. కానీ ఆయన నాన్ లోకల్ పొలిటీషియన్ అనే అర్థం వచ్చేలా కథనాలు రావడం ఇక్కడ ఆసక్తికరం.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్లంటూ వైసీపీ నేతలు విమర్శించారు. పదే పదే వారు హైదరాబాద్ వెళ్లేవారని, అలాంటి వారికి ఇక్కడి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. అవే ప్రశ్నలు ఇప్పుడు వారికే ఎదురవుతున్నాయి. పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటూ వైరి వర్గం నిలదీస్తోంది. ప్రతిపక్ష హోదా కోరుతున్న జగన్ తాడేపల్లిలో ఉండాలి, పోనీ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం పులివెందులలో ఉండాలి. కానీ ఆయన బెంగళూరులో ఉండటమేంటని ట్రోలింగ్ మొదలైంది. మరి దీనికి వైసీపీ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.
జగన్ క్యాంప్ ఆఫీస్ ఎదుట జరిగిన ఘటనను కూడా టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేయడం విశేషం. తాడేపల్లిలో ఆయన్ను కలవడానికి అభిమానులు వస్తే, వ్యక్తిగత సెక్యూరిటీ తన్ని తరిమేశారనే వీడియో వైరల్ గా మారింది. దీనికి వైసీపీ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. చంద్రబాబు పెట్టిన పోలీసులులే ఆ పని చేశారని, అందర్నీ కలిసే అవకాశం జగన్ కి ఉండదని చెప్పుకొచ్చింది.