ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. ఈసీకి ఐపీఎస్ అధికారుల ఫిర్యాదు

తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 19మంది ఐపీఎస్ అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2024-04-07 07:32 IST

ఫలానా ఐపీఎస్ అధికారిని మార్చండి, వారి స్థానంలో ఫలానా వారిని నియమించండి అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేస్తున్న ఫిర్యాదులు, వాటిపై ఎల్లో మీడియా విపరీత కథనాలు.. వెరసి ఈ ఎపిసోడ్ అంతా ఓ కుట్ర అని అభివర్ణించారు ఐపీఎస్ అధికారుల సంఘం నేతలు. ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు, వారికి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా ఛానెళ్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్‌ అధికారులతోపాటు ఏపీలోని పోలీసు వ్యవస్థ మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పక్కా ప్లాన్..

ముందుగా పోలీస్ అధికారులపై నిందలు వేస్తూ రాజకీయ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియో ఓ పద్ధతి ప్రకారం వారిపై బురదజల్లడం మొదలు పెడుతుంది. రాజకీయ నాయకులు చేసినవి కేవలం ఆరోపణలే అయినా.. అవన్నీ వాస్తవాలే అన్నట్టు ఎల్లో మీడియా కథనాలు సృష్టిస్తుంది. వీరంతా కలసి ఈసీపై ఒత్తిడి తెచ్చే విధంగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా పనిచేస్తున్నారు. ఇలాంటి కుట్రతో పోలీస్ వ్యవస్థకు తీరని నష్టం జరుగుతోందని అంటున్నారు ఐపీఎస్ అధికారుల సంఘం నేతలు.

తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 19మంది ఐపీఎస్ అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ 19మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఐపీఎస్‌ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు సమర్పించారు. ఇటీవల ఐపీఎస్‌ అధికారులపై ఎల్లోమీడియాలో వచ్చిన నిరాధారమైన వార్తలను కూడా తమ ఫిర్యాదుకి జతచేశారు.

ఎల్లో మీడియా హడావిడి..

ఈ ఫిర్యాదుతో ఎల్లో మీడియా హడావిడి పడుతోంది. ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులని హైలైట్ చేస్తున్న ఎల్లో మీడియా.. వాటికి కౌంటర్ గా అధికారులు చేసిన ఫిర్యాదుని మాత్రం తప్పుపడుతోంది. ఫిర్యాదు చేసిన వారు వైసీపీ అధికార ప్రతినిధులుగా మారారంటూ మరో అభాండం వేసింది. ఆ లేఖలో 19మంది సంతకాలు లేవని మరో కట్టుకథ అల్లుతోంది. ఐపీఎస్ అధికారుల ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News