అనసూయతో పవన్ కి పోలిక.. ఎందుకంటే..?
గత ఎన్నికల్లో పవన్ ని ఓడించిన ఎమ్మెల్యే గ్రంథి.. తాజాగా వారాహి యాత్ర భీమవరానికి వస్తున్న సందర్భంలో మరోసారి హాట్ కామెంట్లు చేశారు.
ఆమధ్య పవన్ కల్యాణ్ ని హీరోయిన్ కమ్ పొలిటీషియన్లు నవనీత్ కౌర్, సుమలతతో పోలుస్తూ ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి కొడాలి నాని. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎంపీలుగా గెలిచారని, 16 పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్యాకేజీ స్టార్ పవన్, కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. పవన్ కల్యాణ్ పై ఇలాంటి కామెంట్లే చేశారు. పవన్ కంటే యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ బెటర్ అని అన్నారు.
అనసూయతో పోలిక ఎందుకంటే..?
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు స్పందన బాగుందని అంటున్నారు జనసైనికులు. అయితే పవన్ కే కాదు, అనసూయ రాజమండ్రి వచ్చినా జనాలు అంతకంటే బాగా వస్తారని చెప్పారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. గత ఎన్నికల్లో పవన్ ని ఓడించిన గ్రంథి.. తాజాగా వారాహి యాత్ర భీమవరానికి వస్తున్న సందర్భంలో మరోసారి హాట్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు ప్రయోజనాలకోసం పని చేస్తున్న పవన్, కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పార్టీ గుర్తుని, పార్టీని కాపాడుకోవడంపై ముందు పవన్ దృష్టిపెట్టాలన్నారు. కనీసం భీమవరంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎన్నికల విధానం ఎలా ఉంటుంది అనేది కూడా పవన్ కి తెలియవన్నారు. గోదావరి జిల్లాలో రౌడీయిజం అనేది పెద్ద జోక్ అని పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆ మాటకొస్తే.. అప్పట్లో పవన్ వల్ల తమకు ప్రాణ హాని ఉందని, చిరంజీవి కూతురు శ్రీజ పోలీస్ కంప్లయింట్ చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే గ్రంథి. పీక నొక్కేయడం, గుడ్డలు ఊడదీసి కొట్టడం, మక్కెలు ఇరగదీయడం లాంటివి జనసేన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు అని సెటైర్లు వేశారు.
2019 ఎన్నికల్లోనే గోదావరి జిల్లాల వాసులు జనసేనకు విముక్తి పలికారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ వారాహి యాత్ర చేపట్టారన్నారు. గతంలో భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయి తరువాత.. నియోజకవర్గ ప్రజల గురించి పవన్ అసలు పట్టించుకోలేదని, అలాంటి వ్యక్తి మరోసారి ఇక్కడికి వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు గ్రంథి.