ముల్లును ముల్లుతోనే.. టీడీపీకి తగ్గట్టే జగన్ వ్యూహాలు
గంటా లెక్క తేలిపోయింది. పార్టీకి ద్రోహం చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వైసీపీ చర్యలు తీసుకుంటోంది. మరి టీడీపీ, జనసేన నుంచి తమవైపు వచ్చినవారిపై కూడా అలాంటి చర్యలే తీసుకుంటారా..?
నీతి, న్యాయం, నిజాయితీ.. ఇలాంటివి రాజకీయాల్లో చెప్పుకోడానికే కానీ ఆచరించడానికి అస్సలు వీలుండదు. ఒకవేళ ఏపీ సీఎం జగన్ లాంటి వాళ్లు వీటికి తాము బ్రాండ్ అంబాసిడర్లం అని చెప్పుకుని రాజకీయాల్లోకి దిగినా.. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు ఆయన్ను ఎలా మార్చేశాయో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు, పార్టీని వీడిన ఎమ్మెల్యెల్సీలిద్దరిపై కూడా వేటుపడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. వారందర్నీ లిస్ట్ లోనుంచి తొలగించిన తర్వాత ఏపీకి రావాల్సిన రాజ్యసభ సీట్లతో సేఫ్ గేమ్ ఆడాలనేది వైసీపీ వ్యూహం.
సగటు రాజకీయ నాయకుడేనా..?
"మేం ప్రతిపక్షంలో ఉండగా 23మంది ఎమ్మెల్యేలను మా నుంచి అన్యాయంగా లాగేసుకున్నారు, కానీ నేను అలా చేయను.. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తేనే ఎవరికైనా వైసీపీలోకి ఎంట్రీ".. జగన్ వ్యాఖ్యలకు నాడు ఎంతోమంది సామాన్యులు కూడా హర్షించారు. ఆ తర్వాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే.. నేరుగా వైసీపీ కండువా కప్పుకోకుండా పక్కనొచ్చి నిలబడతామంటే జగన్ సరేనన్నారు. పోన్లే ఇక్కడ జగన్ కండిషన్ ఏమీ మారలేదు కదా అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారు క్రమక్రమంగా వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అయ్యారు. ఓహో జగన్ ఫార్ములా ఇదేనా అని జనం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వైసీపీ చర్యలు తీసుకుంటోంది. మరి టీడీపీ, జనసేన నుంచి తమవైపు వచ్చినవారిపై కూడా అలాంటి చర్యలే తీసుకుంటారా..? అంటే అనుమానమేనని చెప్పాలి. అంటే జగన్ కూడా సగటు రాజకీయ నాయకుడిలా మారిపోయారనుకోవచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి.. మద్యపాన నియంత్రణగా కొత్త అర్థం చెప్పినప్పుడే జగన్ కూడా సగటు రాజకీయ నాయకుడనే అభిప్రాయం కొంతమందిలో కలిగి ఉండొచ్చు. తాజా నిర్ణయాలు వాటికి కొనసాగింపు అని చెప్పాలి.
ఏపీకి సంబంధించి వచ్చే నెలలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా చేదు అనుభవం ఎదుర్కొన్న వైసీపీ ఈసారి ముందుగా అలర్ట్ అయింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ పై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఒకే సారి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈలోగా గంటా పని తేల్చేశారు కాబట్టి వారిపై వేటు లాంఛనమేననే సంకేతాలు పంపించినట్టయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలో కూడా స్పీకర్ తమ్మినేని త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరికొంతమంది అసంతృప్తులు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని తేలిపోయినా వారిపై చర్యలు తీసుకోడానికి ఏదో ఒక కారణం దొరకాలి. ఈలోగా మిగతా పని పూర్తి చేస్తోంది వైసీపీ. ఈ పొలిటికల్ గేమ్ లో జగన్ కూడా సగటు రాజకీయ నాయకుడిలాగే మారిపోయారని అనుకున్నా.. టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఆయన ముల్లుని ముల్లుతో తీసే ఫార్ములాని అనుసరిస్తున్నారనే విషయం స్పష్టమైంది.