టీడీపీ చేతిలో ఉన్న ఏ నియోజకవర్గాన్నీ వదలను -జగన్
కుప్పం సమీక్షలో సీటు కన్ఫామ్ చేసి, భరత్ కి మంత్రి పదవి కూడా ఖాయం చేసిన జగన్, ఇప్పుడు అద్దంకి సమీక్షలో మాత్రం అభ్యర్థి జోలికి వెళ్లలేదు. పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
175కి 175 ఇదీ సీఎం జగన్ టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్నిచోట్లా క్లీన్ స్వీప్ సాధ్యమైందని, అదే రిజల్ట్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనపడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. 175 స్థానాల్లో గెలవడం అసాధ్యం కాదని చెబుతున్నారు జగన్. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలన్ని టార్గెట్ చేస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుప్పంతో మొదలు పెట్టిన ఈ సమీక్షలు ఇప్పుడు అద్దంకి చేరుకున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 2024 నాటికి పార్టీని గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
అద్దంకి కాస్త వెరైటీ..
2014లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ గెలుపొందారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. 2019లో ఇక్కడ అదే రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. 2024లో ఈ సీటు కాస్త కీలకంగా మారే అవకాశముంది. కుప్పం సమీక్షలో సీటు కన్ఫామ్ చేసి, భరత్ కి మంత్రి పదవి కూడా ఖాయం చేసిన జగన్, ఇప్పుడు అద్దంకి సమీక్షలో మాత్రం అభ్యర్థి జోలికి వెళ్లలేదు.
అద్దంకిలో గెలవాల్సిందే..
మీరూ, నేను కలిస్తే 175కి 175 సీట్లు సాధించగలుగుతామని కార్యకర్తలకు హితబోధ చేశారు సీఎం జగన్. అదేమీ కష్టం కాదని, అసాధ్యం కానేకాదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 87శాతం కుటుంబాలకు మేలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గంలో వైసీపీకి గెలుపు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. అద్దంకిలో మొత్తం 5 జడ్పీటీసీలు, 5 ఎంపీపీలు, మున్సిపాలిటీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచ్ స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. అద్దంకిలో ప్రజలు టీడీపీని దూరం పెట్టారని, ఈసారి గెలుపు వైసీపీదేనని చెప్పారు జగన్.