ఏపీ లో BRS పార్టీ తొలి విజయం ఇది -తోట చంద్రశేఖర్

కేసీఆర్, కేటీఆర్ విజన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్దులవుతున్నారని.. కేసీఆర్, కేటీఆర్ ని ఆంధ్రాకి తీసుకురావాల్సిందిగా తనను ప్రజలు కోరుతున్నారని చెప్పారు తోట చంద్రశేఖర్. విశాఖపట్నంలో త్వరలోనే BRS పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-04-13 17:58 IST

BRS దెబ్బకి 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' విషయం లో కేంద్రం దిగివచ్చిందని అన్నారు ఏపీ BRS అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ చేతులెత్తేసిన తరుణంలో ఏపీ ప్రజలకు BRS అండగా నిలబడిందని చెప్పారు. ఇది ఏపీలో BRS తొలి విజయం అని అన్నారాయన. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపారని గుర్తు చేశారు. 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందామన్నారు తోట చంద్రశేఖర్.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు అని, స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారని చెప్పారు తోట చంద్రశేఖర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయని గుర్తు చేశారు. జాతి సంపద కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారని చెప్పారు.

ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున BRS పోరాటం చేసిందని, వారికి తాము అండగా నిలబడ్డామని చెప్పారు తోట చంద్రశేఖర్. BRS దెబ్బకి కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదన్నారని, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రకటించారని ఇది BRS ఘనతేనని చెప్పారు.

క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా కేంద్రం తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతుందన్నారు తోట చంద్రశేఖర్. RINL విలువ రూ.3 లక్షల కోట్లు అయితే, కేంద్రం చూపించింది కేవలం రూ.397 కోట్లు మాత్రమే అన్నారు. అదానీ స్టీల్ ప్లాంట్ పెట్టకముందే, బైలడిల్లా గనులను అదానీ గ్రూపుకి కేంద్రం కట్టబెట్టిందని.. ఆ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలని, ప్రైవేటీకరించట్లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించాలని, RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారని, ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరుకు లేకనే, హరీష్ రావు పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు తోట చంద్రశేఖర్. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై మంత్రి హరీష్ రావు వాస్తవాలే మాట్లాడారన్నారు. ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆ నాయకుడే కేసీఆర్ మాత్రమేనన్నారు. కేసీఆర్, కేటీఆర్ విజన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ని ఆంధ్రాకి తీసుకురావాల్సిందిగా తనను ప్రజలు కోరుతున్నారని చెప్పారు. విశాఖపట్నంలో త్వరలోనే BRS పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు తోట చంద్రశేఖర్. 

Tags:    
Advertisement

Similar News