రూల్స్ ఫాలో కావాల్సిందే.. అమరావతి పాదయాత్ర పిటిషన్ల కొట్టివేత

యాత్రలో తాము కూడా పాల్గొంటామంటూ థర్ట్ పార్టీ వేసిన పిటిషన్లను కూడా కొట్టివేసింది హైకోర్టు. ఒక రకంగా ఇది పాదయాత్ర చేస్తున్నవారికి నిరాశ కలిగించే తీర్పు అని చెప్పుకోవాలి.

Advertisement
Update:2022-11-16 15:55 IST

అమరావతి రైతుల పాదయాత్ర నిబంధనలు సవరించాలని వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేని స్పష్టం చేసింది. యాత్ర చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలని, వారంతా ఐడీకార్డ్‌లు దగ్గరపెట్టుకోవాలని తేల్చి చెప్పింది. ఇక యాత్రలో తాము కూడా పాల్గొంటామంటూ థర్ట్ పార్టీ వేసిన పిటిషన్లను కూడా కొట్టివేసింది హైకోర్టు. ఒక రకంగా ఇది పాదయాత్ర చేస్తున్నవారికి నిరాశ కలిగించే తీర్పు అని చెప్పుకోవాలి.

అమరావతి రైతుల పాదయాత్ర పార్ట్ -1 న్యాయస్థానం టు దేవస్థానం.. తిరుమల వరకు సాఫీగానే సాగింది. అయితే పార్ట్-2 అరసవెల్లి యాత్ర మాత్రం అడ్డంకులతో అర్థాంతరంగా ఆగిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ముందుకు సాగడం కష్టం కావడంతో రైతులు వెనక్కి వచ్చేశారు. తమ కష్టాలను చెప్పుకుంటూ కోర్టులో పిటిషన్ వేశారు. 600 మందికి మాత్రమే కోర్టు అనుమతివ్వగా.. అదనంగా మరికొంతమందికి అవకాశమివ్వాలని, యాత్రలోనివారికి విశ్రాంతి కావాల్సి వస్తే కొత్తవారు పాదయాత్రలో కలిసేందుకు వీలుగా అనుమతివ్వాలని కోర్టుని కోరారు. స్థానికంగా స్వాగతం పలికేవారికి కూడా యాత్రలో పాల్గొనేందుకు అనుమతివ్వాలన్నారు. ఇక టీడీపీ నేతలు కూడా పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు అనుమతివ్వాలంటూ థర్డ్ పార్టీ పిటిషన్ వేశారు.

వీటన్నిటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్లన్నీ కొట్టివేసింది. రైతుల పాదయాత్రపై మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్‌ని కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. పార్టీలు కానివారు రిట్ వేస్తే అనుమతించబోమని స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ పిటిషన్ వేయడం న్యాయబద్ధం కాదని చెప్పింది. మధ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో రిట్ అప్పీల్‌కు కూడా విచారణ అర్హత లేదని కోర్టు తేల్చేసినట్టయింది. దీంతో యాత్ర విషయంలో రైతులే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యాత్ర ముందుకు సాగాలంటే 600మంది మాత్రమే అందులో ఉండాలి. ఆ 600 మంది ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వారు మినహా కొత్తగా ఎవరికీ అనుమతి ఇవ్వరు. స్థానిక నేతలు సంఘీభావం తెలపాలనుకుంటే రోడ్డు పక్కన నిలబడాలి కానీ, యాత్రతో పాటు ముందుకు సాగకూడదు. గతంలోనే ఈ నిబంధనలన్నీ స్పష్టం చేసిన హైకోర్టు, వాటిని పాటించాల్సిందేనంటూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

Tags:    
Advertisement

Similar News