కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నాం
గట్టిగా కొడుతున్నామని చెబితే ఎలక్షన్ల గురించి అనుకున్నామని, ప్రత్యర్థి పార్టీ వాళ్లని చెప్పి మరీ గట్టిగా కొట్టారని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.
ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీని కదిలించినా ఈసారి కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం.. అనే మాటే వినిపించింది, వినిపిస్తోంది. పోలింగ్ తర్వాత కూడా అటు వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థులు తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు. యధావిధిగా ఏ పార్టీ అనుకూల మీడియా ఆ పార్టీ అధికారంలోకి రాబోతోందని చెబుతోంది. అయితే ఇక్కడ అధికారం అంటున్నారే కానీ, భారీ మెజార్టీ వస్తుందని మాత్రం ఎవరూ చెప్పడంలేదు, 100 సీట్లకు అటు ఇటుగా ఏ పార్టీకయినా ఓట్లు వస్తాయని అంటున్నారు. వైసీపీకే ఎడ్జ్ ఉందని న్యూట్రల్ ఛానెల్స్ అభిప్రాయపడుతున్నాయి, అదే సమయంలో మెజార్టీ 100 సీట్లకు దాటకపోవచ్చని చెబుతున్నాయి.
సోషల్ మీడియా ట్రోలింగ్..
కొడుతున్నాం.. అంటూ పార్టీ నేతలు చెబుతున్న మాటల్ని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొడుతున్నామంటే ఏదో అనుకున్నామని, ఒకర్ని మరొకరు కొట్టుకోవడమా అని సెటైర్లు పేలుస్తున్నారు. గట్టిగా కొడుతున్నామని చెబితే ఎలక్షన్ల గురించి అనుకున్నామని, ప్రత్యర్థి పార్టీ వాళ్లని చెప్పి మరీ గట్టిగా కొట్టారని అంటున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గొడవలు బాగా జరిగాయి. ఒకరిపై మరొకరు బాంబులు వేసుకునే వరకు వెళ్లారు ప్రత్యర్థులు.
పోలింగ్ తర్వాత గొడవలు..
పోలింగ్ జరిగే సమయంలో కొన్ని చోట్ల గొడవలు జరిగినా.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అవి కొనసాగడం విశేషం. నెల్లూరు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ గొడవలేవీ పోలింగ్ ప్రక్రియకు అడ్డు రాకపోవడం విశేషం. ఏపీలో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని అధికారులు తేల్చి చెప్పారు.