వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్..

సీఎం హోదాలో నాలుగోసారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొన్నారు.

Advertisement
Update:2022-09-27 21:26 IST

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజున ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత తిరుపతిలో గ్రామదేవత, శ్రీవారి సోదరిగా పిలుచుకునే తాతయ్యగుంట గంగమ్మ తల్లిని జగన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అలిపిరికి చేరుకుని ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించారు. ఏపీలో తొలిసారిగా ప్రవేశ పెట్టిన 100 ఈ-బస్‌ సర్వీసుల్లో 50 బస్సులను తిరుపతి-తిరుమల మధ్య ప్రవేశపెట్టారు.



 ఇక తిరుమలలో సీఎం జగన్ కు తిరుమల ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి. సీఎం హోదాలో ఆయన నాలుగోసారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలో జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.

రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు సీఎం జగన్. బుధవారం పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీటీడీ కోసం నిర్మించిన లక్ష్మి వీపీఆర్‌ రెస్ట్‌ హౌస్‌ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రేణిగుంటకు చేరుకుని ఎయిర్ పోర్ట్ నుంచి ఓర్వకల్ కి బయలుదేరుతారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్‌ కో సిమెంట్స్‌ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags:    
Advertisement

Similar News