రాజీనామా చేసి రా..! తేల్చుకుందాం..

తామిద్దరం స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు చేద్దామని.. ట్యాపింగ్ నిజమైతే తాను ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని, అబద్ధం అని నిరూపిస్తే కోటంరెడ్డి రాజీనామా ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు.

Advertisement
Update:2023-02-02 20:48 IST

ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది. వైసీపీ నేతలు అది ట్యాపింగ్ కాదంటున్నారు. ఆనం, కోటంరెడ్డి వర్గం మాత్రం ముమ్మాటికీ ట్యాపింగేనంటోంది. ఈ దశలో ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్ ఓ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి రావాలన్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఏంటో తేల్చుకుంటామని చెప్పారు.

స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేద్దామా..?

నెల్లూరు రూరల్, సిటీ స్థానాల్లో తమ ఇద్దరికీ టికెట్లు ఇవ్వొద్దని ఎన్నికల సమయంలో చాలామంది జగన్ కు చెప్పారని, కానీ ఆయన తమ ఇద్దరినీ సొంతమనుషులుగా చూసుకున్నారని అన్నారు అనిల్. అలాంటి తాము జగన్ కి రుణపడి ఉండాలన్నారు. కానీ కోటంరెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయించుకుని నిందలు వేయడం సరికాదన్నారు. తామిద్దరం స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు చేద్దామని.. ట్యాపింగ్ నిజమైతే తాను ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని, అబద్ధం అని నిరూపిస్తే కోటంరెడ్డి రాజీనామా ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు.

మిగతా ఆడియోలో ఏం చెప్పావ్..?

సాక్ష్యాలు, ఆధారాలు అంటూ ప్రెస్ మీట్ పెట్టిన కోటంరెడ్డి 15 సెకన్ల ఆడియో క్లిప్ చూపించారని, అందులో ఆయన మాటలు తప్ప ఇంకేవీ లేవన్నారు. అయితే పూర్తి ఆడియో 59 సెకన్లు ఉందని, దమ్ముంటే దాన్ని బయట పెట్టాలన్నారు అనిల్. ఆ ఆడియో బయటపెడితే అసలు కోటంరెడ్డి మనోభావాలు ఏంటో బయటపడతాయన్నారు.

జనవరి 27న టికెట్ ఖరారు..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎప్పుడెప్పుడు ఎవరెవర్ని కలిశారు, ఎప్పుడు ఆయనకు టీడీపీ టికెట్ ఖరారైంది అనే విషయంపై తనకు పూర్తి సమాచారం ఉందని, అయితే కొన్ని నెలలుగా ఆయనతో విభేదాలు ఉండటంతో.. తాను వాటిని బయటపెట్టలేదన్నారు. జనవరి 27న టీడీపీ టికెట్ ఖరారైన తర్వాతే కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని వివరించారు. పార్టీనుంచి బయటకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. పార్టీపై నిందవేయడం సరికాదన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఆ తర్వాత ట్యాపింగ్ ఆరోపణలపై నిజా నిజాలు నిగ్గుతేలుద్దామంటూ కోటంరెడ్డికి సవాల్ విసిరారు అనిల్.

Tags:    
Advertisement

Similar News