కట్టెలపొయ్యి, కొబ్బరి పచ్చడి.. లంకలో జీవనం ఇలా..
శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. చివరకు ఓ మోస్తరు ధనవంతులు కూడా రోడ్డునపడే పరిస్థితి. ప్రస్తుతం శ్రీలంక వాసుల్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ కట్టెలపొయ్యిలే దిక్కయ్యాయి. అపార్ట్ మెంట్లలో ఉండేవారు కూడా కిందకు దిగొచ్చి కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లి 200కు చేరింది. బంగాళా దుంప కేజీ రూ.220 గా ఉంది. గ్రాము […]
శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. చివరకు ఓ మోస్తరు ధనవంతులు కూడా రోడ్డునపడే పరిస్థితి. ప్రస్తుతం శ్రీలంక వాసుల్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ కట్టెలపొయ్యిలే దిక్కయ్యాయి. అపార్ట్ మెంట్లలో ఉండేవారు కూడా కిందకు దిగొచ్చి కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లి 200కు చేరింది. బంగాళా దుంప కేజీ రూ.220 గా ఉంది. గ్రాము వెల్లుల్లి ఏకంగా 160 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో అసలు కూరగాయలు కొని వంట చేసుకునే పరిస్థితి లేదు. దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కొబ్బరి పచ్చడి కామన్ గా కనపడుతోంది. ప్రతిరోజూ ప్రతి ఇంట్లో కొబ్బరిపచ్చడే కూర. కాస్త ధనవంతులైతే ఒక టమాటా, ఒక బంగాళా దుంప, ఒక క్యారెట్ తో కిచిడీ చేసుకుని తింటున్నారట.
తగ్గిన వాయు కాలుష్యం..
శ్రీలంకలో వాయు కాలుష్యం బాగా తగ్గింది. వాహనాల రద్దీ లేకపోవడం, ఫ్యాక్టరీలన్నీ మూతపడటంతో.. కాలుష్యం జాడే లేని స్వచ్ఛమైన శ్రీలంకని చూస్తున్నారు అక్కడి స్థానికులు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోలు 500 రూపాయలు. బ్లాక్ లో కొనాలంటే 2 వేలు సమర్పించుకోవాల్సిందే. అందుకే జనం పెట్రోల్ బంకుల ముందు క్యూలైన్లలో రోజులతరబడి నిలబడుతున్నారు. దిండ్లు, దుప్పట్లు తెచ్చుకుని క్యూలైన్లలోనే పడుకుంటున్నారు. అక్కడే భోజనం చేస్తున్నారు. ఇంత చేసినా వారానికి రేషన్ లో ఒక లీటర్ పెట్రోల్ దొరికితే అదే అదృష్టం. చాలామంది తెలివిగా సొంత అవసరాలను పక్కనపెట్టి పెట్రోల్ కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు.
సైకిళ్లకు పెరిగిన డిమాండ్..
ఒకప్పుడు కొలంబో రోడ్లపై బస్సులు, కార్లు, ట్యాక్సీలు, బైక్ లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లేవి. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. ఇప్పుడు రోడ్లపై సైకిళ్ల సంఖ్య పెరిగింది. పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో దాదాపుగా అందరూ సైకిళ్లనే ప్రిఫర్ చేస్తున్నారు. ఏ పనికైనా వాటిపైనే వెళ్తున్నారు. డిమాండ్ పెరగడంతో సైకిళ్ల రేట్లు కూడా రెట్టింపయ్యాయి. ఉద్యోగులు ఆఫీసులకు సైకిళ్లపైనే వెళ్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో చాలా మందికి సైకిళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గా మారాయి.
శ్రీలంకలో ఇప్పుడప్పుడే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా లేదు. అన్ని పార్టీలు కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స బుధవారం రాజీనామా చేస్తారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ కష్టాలనుంచి ప్రజల్ని గట్టెక్కించగలదో లేదో చూడాలి.