ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. గొటబాయ పారిపోకుండా ఆపింది అధికారులే..!
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారా? భార్యతో సహా ఆయన దుబాయ్ వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఏకంగా అధ్యక్ష భవనంపై వేలాది మంది ప్రజలు దాడి చేసి ఆక్రమించుకున్నారు. అంతకు ముందే భవనాన్ని వదిలి గొటబాయ అజ్ఞాతంలోకి […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారా? భార్యతో సహా ఆయన దుబాయ్ వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
శ్రీలంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఏకంగా అధ్యక్ష భవనంపై వేలాది మంది ప్రజలు దాడి చేసి ఆక్రమించుకున్నారు. అంతకు ముందే భవనాన్ని వదిలి గొటబాయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన దేశం వదిలి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వాటిని స్పీకర్ మహీంద ఖండించారు.
గొటబాయ అధ్యక్ష పదవిలో ఉండటంతో అతడిని అరెస్టు చేయడం కుదరదు. గొటబాయపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలంటే పోలీసులు తప్పకుండా అదుపులోకి తీసుకోవాలి. బుధవారం రాజీనామా చేస్తే.. ఆ వెంటనే అతడి అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేశారు. ఈ విషయం తెలిసే రాజీనామా కంటే ముందే దేశం వదిలి దుబాయ్ పారిపోవడానికి గొటబాయ, ఆయన భార్య కొలంబో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. వీఐపీ సూట్‌లోకి వెళ్లి పాస్‌పోర్టు మీద స్టాంపింగ్ చేయించుకోవాలని గొటబాయ భావించారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు గొటబాయను వీఐపీ స్టాంపింగ్ లాంజ్‌లోకి వెళ్లడానికి కూడా నిరాకరించారు. అధ్యక్షుడు, ఆయన భార్యను గేటు దగ్గరే ఆపేశారు. ఆయనను అనుమతిస్తే ప్రజలు, ఇతర ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వస్తుందనే భయంతోనే గొటబాయను అనుమతించలేదని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
తనను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకపోవడంతో.. గొటబాయ, ఆయన భార్య పక్కనే ఉన్న మిలటరీ బేస్‌కు వెళ్లారు. అక్కడే శనివారం రాత్రంతా గడిపినట్లు అధికారులు చెప్పారు. ఆ సమయంలో కొలంబో విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి నాలుగు విమానాలు వెళ్లాయని.. ఏ ఒక్క దాంట్లో కూడా గొటబాయను అనుమతించలేదని తెలుస్తుంది. మంగళవారం ఉదయం గొటబాయ తమ్ముడు బాసిల్ కూడా దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయన గొటబాయ సర్కారులో ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేశారు. మంగళవారం ఉదయం ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ వెళ్లడానికి రాగా.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.
బిజినెస్ ట్రావెలర్స్ ఉపయోగించే పెయిడ్ చెకింగ్ ద్వారా ఆదరబాదరాగా వెళ్లడానికి బాసిల్ ప్రయత్నించారు. అయితే, తాము ఫాస్ట్ ట్రాక్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అప్పటికప్పుడు ప్రకటించి బాసిల్‌ను అడ్డుకున్నారు. సాధారణ చెకింగ్ చేసి బాసిల్ ఫ్లైట్ ఎక్కగా.. తోటి ప్రయాణికులు అతడితో కలిసి ప్రయాణించడానికి నిరాకరించారు. అతడిని వెంటనే ఫ్లైట్ నుంచి దింపేయాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో బాసిల్ విమానం నుంచి దిగిపోయి ఇంటికి వెళ్లారు.
మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బాసిల్‌కు యూఎస్, శ్రీలంక డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంది. గొటబాయ అధ్యక్ష భవనాన్ని వదిలి వెళ్లిన తర్వాత బాసిల్ కొత్త పాస్‌పోర్టు కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఉన్న పాస్‌పోర్ట్‌తోనే దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించడంతో గొటబాయ, బాసిల్ దేశం వదిలి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.