రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కోసం బీజేపీ కార్ల ర్యాలీ.. అసలు ప్లాన్ అదే!

రాష్ట్రపతి ఎలక్షన్ విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అయినా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. సిన్హా గెలిచేది లేదని ప్రస్తుతం ముర్ముకు మద్దతు ఇచ్చిన పార్టీల ఎలక్టోరల్ కాలేజీ విలువతో సునాయాసంగా గెలుస్తారని అందరికీ తెలిసిందే. అయినా సరే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు పిలిపించి భారీ ర్యాలీ తీసింది టీఆర్ఎస్. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే […]

Advertisement
Update:2022-07-10 04:46 IST

రాష్ట్రపతి ఎలక్షన్ విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అయినా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. సిన్హా గెలిచేది లేదని ప్రస్తుతం ముర్ముకు మద్దతు ఇచ్చిన పార్టీల ఎలక్టోరల్ కాలేజీ విలువతో సునాయాసంగా గెలుస్తారని అందరికీ తెలిసిందే.

అయినా సరే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు పిలిపించి భారీ ర్యాలీ తీసింది టీఆర్ఎస్. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే జలవిహార్‌లో సిన్హాతో మీటింగ్ పెట్టారు కేసీఆర్. దేశంలో మరే ఇతర సీఎం చేయని విధంగా సిన్హాకు తెలంగాణలో ఘన స్వాగతం పలికారు. తాను మోడీ, ఎన్టీయేకు వ్యతిరేకం అనే మెసేజ్ దేశమంతా తెలియాలనే కేసీఆర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఇక ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ వేదికగా తమ బలాన్ని ప్రదర్శించడానికి సిద్దపడుతోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తుండటంతో ఆమెకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకాలని భావిస్తోంది. ఈనెల 12న ముర్ము హైదరాబాద్‌కు ప్రచారం కోసం రానున్నారు. తెలంగాణ బీజేపీ ఆమెకు ఈ సందర్భంగా ఘనస్వాగతం పలకడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేసింది. రాజ్‌భవన్ రోడ్డులోని ఓ హోటల్‌లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం నిర్వహించనున్నారు.

ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు ద్రౌపది ముర్ము బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి ఆమెను భారీ కార్ల ర్యాలీతో రాజ్‌భవన్ రోడ్డులోని హోటల్‌కు తోడ్కొని వెళ్తారు. యశ్వంత్ సిన్హా వచ్చిన సమయంలో టీఆర్ఎస్ చేసిన బైక్ ర్యాలీ కంటే భారీగా ఉండాలని బీజేపీ భావిస్తోంది.

అలాగే హోటల్‌లో జరిగే సమావేశానికి బీజేపీ ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌ను ఆహ్వానించింది. ద్రౌపది ముర్ము షెడ్యూల్‌లో హైదరాబాద్ పర్యటన లేకపోయినా.. రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టడంతోనే ఆమె ప్లాన్ మార్చుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ద్రౌపది ముర్మును రాష్ట్రానికి రప్పించడం ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని పంపాలని బీజేపీ భావిస్తున్నట్లు ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల ఉన్నతికి పాటు పడుతున్న పార్టీ బీజేపీ మాత్రమే అనే విషయాన్ని హైలైట్ చేయాలని అనుకుంటోంది. ఇటీవల గిరిజనులపై పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, తాము మాత్రం గిరిజన మహిళకు అత్యున్నత పదవిని ఇచ్చామని చెప్పుకునేందుకు ఈ సందర్భాన్ని బీజేపీ వాడుకోనున్నది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రజలకు మరింతగా స్పష్టం చేయడానికి ముర్ము పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News