బీహార్ విద్యార్థిని కష్టానికి చలించిన కేటీఆర్.. వివరాలిస్తే సాయం చేస్తానని హామీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కేవలం ప్రభుత్వ, రాజకీయ పరమైన ట్వీట్లే కాకుండా.. అప్పుడప్పుడు తనకు వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందిస్తుంటారు. ఎవరైనా పేద వాళ్లు ఆసుపత్రుల్లో ఉన్నా, చదువుకు ఆర్థిక సాయం కావాలన్నా ఆయనను సంప్రదిస్తుంటారు. ఒక్కోసారి ఎవరైనా బాధితుల తరపున సాయం కోరినా చేస్తుంటారు. తాజాగా బీహార్ విద్యార్థిని కష్టానికి కేటీఆర్ చలించిపోయారు. ఆమె బాధను ఎవరూ ఆయనకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో చూసి సాయం చేయడానికి ముందుకు […]

Advertisement
Update:2022-07-01 11:23 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కేవలం ప్రభుత్వ, రాజకీయ పరమైన ట్వీట్లే కాకుండా.. అప్పుడప్పుడు తనకు వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందిస్తుంటారు. ఎవరైనా పేద వాళ్లు ఆసుపత్రుల్లో ఉన్నా, చదువుకు ఆర్థిక సాయం కావాలన్నా ఆయనను సంప్రదిస్తుంటారు. ఒక్కోసారి ఎవరైనా బాధితుల తరపున సాయం కోరినా చేస్తుంటారు. తాజాగా బీహార్ విద్యార్థిని కష్టానికి కేటీఆర్ చలించిపోయారు. ఆమె బాధను ఎవరూ ఆయనకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో చూసి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒక దివ్యాంగురాలు. ఆమెకు ఒక్క కాలు ఉండటంతో ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెంతుతూ వెళ్తోంది. చిన్నతనం నుంచి తాను ఇలాగే ఒకే కాలుతో జీవిస్తున్నానని.. తనకు కృత్రిమ కాలు అందించడంలో సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. తనకు చదువంటే చాలా ఇష్టమని. ఏ ఆటంకం లేకుండా నా కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్నానని ఆమె చెప్పింది.

కాగా ఏఎన్ఐ అనే వార్త సంస్థ దీనికి సంబంధించిన వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఈ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్ ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. ఏఎన్ఐ సంస్థలో ఉన్న ఎవరైనా ఈ అమ్మాయి కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వండి. నేను నా సొంత డబ్బులతో చేతనైన సాయం చేస్తాను. ఆమె కలలను నెరవేర్చడంలో నా వంతు సాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి ఏఎన్ఐ హైదరాబాద్ బ్యూరో చీఫ్ ప్రమోద్ చతుర్వేది స్పందించారు. ఆ అమ్మాయి వివరాలను పంపిస్తున్నామని చెప్పారు.

కాగా, కేటీఆర్ మంచి మనసుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో కేటీఆర్ చేస్తున్న ఈ పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News