కాంగ్రెస్‌లో వర్గపోరు.. అధిష్టానానికి అద్దంకి దయాకర్ లేఖ

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి ముదిరి పాకానపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై ఓ వర్గం గుర్రుగా ఉంది. ఏకంగా ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు 2018 ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వడ్డెపల్లి రవి రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగారు. రవి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ […]

Advertisement
Update:2022-06-27 04:36 IST

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి ముదిరి పాకానపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై ఓ వర్గం గుర్రుగా ఉంది. ఏకంగా ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు 2018 ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వడ్డెపల్లి రవి రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగారు.

రవి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ అండ ఉండటంతో రవి అందుకు అంగీకరించలేదు. ఈ విషయాన్ని అప్పట్లోనే అద్దంకి దయాకర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధిష్టానం పెద్దలు రవితో మాట్లాడి నామినేషన్ ఉపసంహరించుకోమని కూడా చెప్పారు. కానీ, అతడు ఎన్నికల బరిలోనే ఉన్నాడు.

ఈ క్రమంలో అతడిని పార్టీ నుంచి 8 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌పై అద్దంకి దయాకర్ 2వేల ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో రెబల్ అభ్యర్థికి రెండు వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్, రవిల మధ్య పోరు నడుస్తోంది.

అద్దంకి దయాకర్‌కు పార్టీలో రేవంత్ రెడ్డి వర్గపు మనిషిగా పేరుంది. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుడు రవికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది సూర్యాపేట జిల్లాలో వర్గ పోరుకు దారి తీసింది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి దయాకర్ ఆయన వెంటే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటే ఆయన వెంట ఉంటానని.. రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నా.. ఆయన తోనే నడుస్తానని అద్దంకి దయాకర్ గతంలోనే వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తుంగతుర్తి నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో దయాకర్‌కు చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి రవిని ప్రోత్సహించారు. తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. అధిష్టానం విధించిన సస్పెన్షన్ 2024 వరకు ఉంది. అయినా సరే తనకు తానుగా వెంకటరెడ్డి ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విషయంపై అద్దంకి దయాకర్ వెంటనే రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా, తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని, స్థానిక ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని.. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందని వెంకట్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతోనే అందరినీ కలుపుకొని పోతున్నామని రవి చేరికను సమర్దించుకున్నారు. అయితే, రేవంత్-వెంకటరెడ్డి మధ్య విభేదాల కారణంగా అద్దంకి దయాకర్ నలిగిపోతున్నాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తుంగతుర్తిలో కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన దయాకర్‌ను కాదని వచ్చే ఎన్నికల్లో వేరే వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాపై ఫోకస్ పెట్టిన రేవంత్.. కోమటిరెడ్డి బ్రదర్స్ బలంగా ఉన్న చోట ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్నారు. దీనికి కౌంటర్‌గానే తుంగతుర్తిలో రవిని తెరపైకి వెంకట్‌రెడ్డి తెచ్చారని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ గ్రూపు తగాదాలు ఇప్పట్లో తీరేలా లేవు.

Tags:    
Advertisement

Similar News