తలకెక్కిన అధికారం… మార్నింగ్ వాక్ కోసం రోడ్డునే బ్లాక్ చేసిన ఓ ఐపీఎస్
ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో కలిసి సాయంత్రం వాకింగ్ చేయడానికి ఓ స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించిన విషయం మర్చిపోకముందే మరో ఐపీఎస్ అధికారి తన మార్నింగ్ వాక్ కోసం ప్రజలకు అత్యవసరమైన ఓ రోడ్డునే బ్లాక్ చేశారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే…. కొచ్చిలోని క్వీన్స్ వాక్‌వే పక్కనే ఉన్న రహదారిని పిల్లల సైకిలింగ్ కోసం ప్రతి ఆదివారం […]
ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో కలిసి సాయంత్రం వాకింగ్ చేయడానికి ఓ స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించిన విషయం మర్చిపోకముందే మరో ఐపీఎస్ అధికారి తన మార్నింగ్ వాక్ కోసం ప్రజలకు అత్యవసరమైన ఓ రోడ్డునే బ్లాక్ చేశారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే….
కొచ్చిలోని క్వీన్స్ వాక్‌వే పక్కనే ఉన్న రహదారిని పిల్లల సైకిలింగ్ కోసం ప్రతి ఆదివారం బ్లాక్ చేస్తారు. అయితే అదే వాక్ వే లో రోజూ మార్నింగ్ వాక్ వచ్చే అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ట్రాఫిక్ , వినోద్ పిళ్లై కొద్ది రోజులుగా ప్రతి రోజూ రహదారిని బ్లాక్ చేయిస్తున్నారు. దాంతో ఆ దారిలో వెళ్ళే వాహనదారులు, పాఠశాలలకు వెళ్ళే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు రోడ్డు దిగ్బంధనం చేయడంతో స్కూల్ పిల్లలను బస్సుల్లో ఎక్కించడానికి చాలా దూరం నడిచిపోవాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు.
కనీసం పాఠశాల బస్సులైనా అనుమతించాలని ఏసీపీ వినోద్ పిళ్లైని స్థానికులు కోరగా ఆయన అందుకు అనుమతించలేదని స్థానికంగా నివాసముండే డాక్టర్ ఎలిజబెత్ జార్జ్ మీడియాతో చెప్పారు.
అయితే ACP వినోద్ పిళ్లై మాత్రం స్థానికుల ఆరోపణలను ఖండించారు. ఈ రహదారి కొచ్చిలోని క్వీన్స్ వాక్‌వేలో భాగమని, జాగర్స్ కోసమే ఆదివారాలు మూసివేయబడిందని చెప్పారు. పైగా ఇతర రోజుల్లో రహదారిని మూసివేయలేదన్నారాయన.
కానీ స్థానిక ప్రజలు మాత్రం ACP అసత్యాలు చెప్తున్నారని మూడురోజులుగా రహదారి బ్లాక్ చేశారని, రోజువారీ రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అక్కడున్న చాలా మంది వైద్యులు, ఈ సమయంలో అత్యవసరమైతే ఆసుపత్రికి వెళ్ళడానికి ఎక్కువ దూరం నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ACP వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తన వాకింగ్ కోసం అతను రోడ్డును బ్లాక్ చేసింది నిజమని తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.