వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం..
భారత్ లో కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేయబోతోంది. రోజుకి వెయ్యి చొప్పున ఆ రెండు కేటగిరీల వారికి టికెట్లు కేటాయిస్తారు. గతంలో రోజుకి 750 టికెట్లను వృద్ధులు, వికలాంగులకు కేటాయించగా ఇప్పుడు ఆ సంఖ్యను వెయ్యికి పెంచారు. ప్రతి […]
భారత్ లో కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేయబోతోంది. రోజుకి వెయ్యి చొప్పున ఆ రెండు కేటగిరీల వారికి టికెట్లు కేటాయిస్తారు. గతంలో రోజుకి 750 టికెట్లను వృద్ధులు, వికలాంగులకు కేటాయించగా ఇప్పుడు ఆ సంఖ్యను వెయ్యికి పెంచారు. ప్రతి రోజు ఉదయం 10గంటలకు వృద్ధులు, వికలాంగుల కోటా టోకెన్లపై దర్శన అవకాశం కల్పిస్తారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు వీరికి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
కొవిడ్ కారణంగా 2020 మార్చి 20న శ్రీవారి దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. ఆ తర్వాత కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ తొలుత టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. కొన్నిరోజుల తర్వాత కేవలం ఆన్ లైన్లో మాత్రమే టికెట్లు విడుదల చేశారు. ఇటీవల తిరుపతిలో నేరుగా టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టారు. ఆర్జిత సేవలకు కూడా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. ఇప్పుడు వృద్ధులు, వికలాంగుల టికెట్లపై కూడా పాత పద్ధతినే అమలు చేయబోతోంది. అయితే ఆ కోటాను ఇప్పుడు రోజుకి వెయ్యి టికెట్లకు పెంచడం విశేషం.
ఆ ఒక్క నిబంధన కూడా తీసేస్తారా..?
ప్రస్తుతం తిరుమలలో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. కానీ కొండ పైకి వెళ్లేందుకు మాత్రం దర్శనం టికెట్ తప్పనిసరి అనే నిబంధన మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. మెట్లదారిలో అయినా, ఘాట్ రోడ్డులో అయినా, దర్శనం టోకెన్ చూపెడితేనే భక్తులకు అనుమతి ఉంది. దీంతో నేరుగా జాపాలి వంటి ఇతర తీర్థాలను దర్శించుకునే భక్తులు తిరుమల కొండపైకి వెళ్లలేకపోతున్నారు. ఆ నిబంధన సడలింపుపై కూడా టీటీడీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.