సోనూసూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు..
లాక్ డౌన్ కాలంలో పేదలకు, వలస కార్మికులకు సాయం చేసి అండగా నిలబడిన సినీ నటుడు సోనూ సూద్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ట్వీట్ తో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిందని, ఈ డీల్ లో ఆదాయ […]
లాక్ డౌన్ కాలంలో పేదలకు, వలస కార్మికులకు సాయం చేసి అండగా నిలబడిన సినీ నటుడు సోనూ సూద్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ట్వీట్ తో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిందని, ఈ డీల్ లో ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అందుకే సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముంబై, లక్నోలో సోనూ సూద్ కి చెందిన ఆరు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి.
లాక్ డౌన్ టైమ్ లో పేదలకు తన శక్తికి మించి సాయం చేశారు సోనూ సూద్. స్థానిక ప్రభుత్వాలు కూడా ఆదుకోలేని సందర్భంలో సోనూకి చిన్న ట్వీట్ వేస్తే చాలు అన్నీ సమకూర్చేవారు. లాక్ డౌన్ ఫస్ట్ ఫేజ్ లో వలస కార్మికులను ఆదుకున్న సోనూ సూద్, భారత్ లో సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులు కూడా రోగులకు సమకూర్చారు. వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ దశలో ఆయన రాజకీయాల్లో చేరతారనే ఊహాగానాలు బలంగానే వినిపించాయి. స్థాయికి మించి ఆయన పేదలకు ఎలా సాయం చేస్తున్నారని, దాని వెనకున్న మతలబు ఏంటని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ అలాంటి విమర్శలను ఆయన పట్టించుకోలేదు, రాజకీయాల జోలికి కూడా వెళ్లలేదు. అయితే ఇటీవల ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూ సూద్ ని స్కూల్ విద్యార్థులకోసం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి మెంటార్ గా నియమించింది. తాను రాజకీయాల్లో చేరడంలేదని, కేవలం ఢిల్లీ ప్రభుత్వం తరపున మాత్రమే పనిచేస్తానని సోనూ సూద్ వివరణ ఇచ్చినా.. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం ఖాయమని గుసగుసలు వినిపించాయి.
రాజకీయ కక్షసాధింపా..?
సోనూ సూద్ క్రేజ్ ని వాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఆయనకు గేలం వేసిన సంగతి బహిరంగ రహస్యమే. తనను చాలా పార్టీలు సంప్రదించాయని, కానీ తాను రాజకీయాల్లోకి రానని ఇప్పటికే చాలాసార్లు కుండబద్దలు కొట్టారు సోనూ సూద్. అయితే ఢిల్లీ ప్రభుత్వంతో కలసి పనిచేయడం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సోనూ సూద్ ని ఇబ్బంది పెడుతున్నారని ఆమ్ ఆద్మీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్యమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది అంటూ.. సోనూ సూద్ ఐటీ రైడ్స్ వీడియోస్ ని ట్యాగ్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అటు శివసేన కూడా సోనూ సూద్ కి మద్దతుగా మాట్లాడింది, బీజేపీ ప్రతీకార చర్యలకు దిగుతోందంటూ మండిపడింది.