పేద, ధనిక దేశాల మధ్య టీకాల కొట్లాట..

వ్యాక్సిన్లు తయారు చేసిన కొత్తల్లో ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన ధనిక దేశాలు వాటిని ఏక మొత్తంగా సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆరేడు నెలలకు కానీ కొన్ని పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ తారతమ్యాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నించినా ఫలితం లేదు. ధనిక దేశాలన్నీ ముందుగా ఆర్డర్లు ఇవ్వడంతోపాటు సదరు కంపెనీలన్నీ ఆయా దేశాల్లోనే ఉండటంతో.. స్థానికతకే వారు పెద్దపీట వేశారు. దీంతో భారత్ వంటి దేశాలు పలు ఆఫ్రికన్ కంట్రీస్ […]

Advertisement
Update:2021-09-10 02:51 IST

వ్యాక్సిన్లు తయారు చేసిన కొత్తల్లో ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన ధనిక దేశాలు వాటిని ఏక మొత్తంగా సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆరేడు నెలలకు కానీ కొన్ని పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ తారతమ్యాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నించినా ఫలితం లేదు. ధనిక దేశాలన్నీ ముందుగా ఆర్డర్లు ఇవ్వడంతోపాటు సదరు కంపెనీలన్నీ ఆయా దేశాల్లోనే ఉండటంతో.. స్థానికతకే వారు పెద్దపీట వేశారు. దీంతో భారత్ వంటి దేశాలు పలు ఆఫ్రికన్ కంట్రీస్ కి టీకాలను ఉచితంగా అందించాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు మరో సమస్య మొదలైంది. పేద దేశాల్లో సింగిల్ డోస్ టీకాకే జనం అల్లాడిపోతున్న సందర్భంలో బ్రిటన్, అమెరికా సహా పలు ఇతర దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసులను సిద్ధం చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలను గుప్పెట్లో పెట్టుకున్న సంపన్న దేశాలు, అక్కడి కంపెనీలు పేద దేశాల ప్రజలకు అడుగూబొడుగూ టీకాలను విదిలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు WHO అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోం. బూస్టర్ డోస్ పై ఏడాది చివరి వరకు మారటోరియం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే దీనికి అమెరికా సుముఖంగా లేదని తెలుస్తోంది. బూస్టర్ డోస్ ల అవసరం ఉందని, ఆ విషయంలో తమ దేశ పౌరుల ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని చెబుతోంది.

మరోవైపు బ్రిటన్‌.. ఆస్టాజ్రెనెకా, ఫైజర్‌ బూస్టర్‌ డోసులకు లాంఛనంగా అనుమతి ఇచ్చింది. రోగ నిరోధక శక్తి తగ్గినవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని బ్రిటిష్‌ ఔషధ నియంత్రణ సంస్థ సూచిస్తోంది. బ్రిటిష్‌ జనాభాలో రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీస్ తగిన స్థాయిలో లేనివారు సుమారు 5 లక్షలమంది ఉన్నారు. వారందరికీ ఇప్పుడు బూస్టర్ డోస్ ఇవ్వబోతున్నారు. అయితే బూస్టర్‌ డోసుల విషయంలో తొందరపాటు వద్దని ఆస్ట్రాజెనెకా హెచ్చరిస్తోంది. అసలు మూడో డోసు అవసరమా కాదా అనేది ఇంకా తేలలేదని ఆ కంపెనీ చెబుతోంది.

వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆయా కంపెనీలు చెబుతున్న లెక్కలున్నాయి కానీ, ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికీ దానిపై నమ్మకం కలగలేదు. అదే సమయంలో వ్యాక్సిన్ వల్ల వచ్చే యాంటీబాడీలు ఎన్ని నెలల వరకు ఉంటాయనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో బూస్టర్ డోస్ అనివార్యం అని టీకాల లభ్యత ఉన్న ధనిక దేశాలు అభిప్రాయ పడుతున్నాయి. తమ పౌరులకు బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం టీకాల లభ్యత తక్కువగా ఉన్న పేద దేశాలపై పడుతోంది. అక్కడ కనీసం సింగిల్ డోస్ టీకా కూడా ఇంకా పూర్తికాలేదు. టీకాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధనిక దేశాలు బూస్టర్ డోస్ ల విషయంలో కాస్త నెమ్మదించాలని WHO సూచిస్తోంది. అయితే WHO సూచనలు, సలహాలను ఆయా దేశాలు ఎంతవరకు పాటిస్తాయనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News