యూపీలో ఎంఐఎం ఎంట్రీ.. కాంగ్రెస్ గరం గరం..
ఆమధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుని అందరికీ షాకిచ్చింది. అదే ఊపులో పశ్చిమబెంగాల్ లో పాగా వేయాలనుకుంటే మాత్రం కుదరలేదు. అక్కడ ఎంఐఎంను బీజేపీ బీ టీమ్ గా అభివర్ణించిన మమతా బెనర్జీ.. అసదుద్దీన్ పార్టీకి అస్సలు ఛాన్సే లేకుండా చేశారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ యూపీ ఎన్నికలపై కన్నేసింది. ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు అసదుద్దీన్. అయోధ్యకు సమీపంలోని రుదౌలిలో ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సుల్తాన్ పూర్, […]
ఆమధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుని అందరికీ షాకిచ్చింది. అదే ఊపులో పశ్చిమబెంగాల్ లో పాగా వేయాలనుకుంటే మాత్రం కుదరలేదు. అక్కడ ఎంఐఎంను బీజేపీ బీ టీమ్ గా అభివర్ణించిన మమతా బెనర్జీ.. అసదుద్దీన్ పార్టీకి అస్సలు ఛాన్సే లేకుండా చేశారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ యూపీ ఎన్నికలపై కన్నేసింది. ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు అసదుద్దీన్. అయోధ్యకు సమీపంలోని రుదౌలిలో ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సుల్తాన్ పూర్, బారాబంకీ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేశారు.
అయోధ్య పేరుతోనే డైరెక్ట్ ఫైట్..
యూపీలోని ఫైజాబాద్ జిల్లా పేరును 2018 నవంబర్ లో అయోధ్యగా మార్చారు. అయితే ఎంఐఎం బహిరంగ సభ పోస్టర్లలో మాత్రం అయోధ్య పేరు లేకుండా ఫైజాబాద్ జిల్లా అని పేర్కొంది. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటలయుద్ధానికి తెరలేచింది. ఎంఐఎం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని వెంటనే ఆ పార్టీ నిర్వహించే ర్యాలీని రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒవైసీని అయోధ్యలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అయితే ఇవన్నీ పైపై పగలేనని, బీజేపీ, ఎంఐఎం పాత స్నేహితులేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రతిపక్షాలతో కలసి ఈసారి యూపీలో బీజేపీని నిలువరించాలని చూస్తున్న కాంగ్రెస్, ఎంఐఎంని బీజేపీ బీ టీమ్ గా పేర్కొంటోంది. ఎంఐఎం, బీజేపీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ ఫైట్ చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఒవైసీ పార్టీ తన సొంతరాష్ట్రం తెలంగాణలోనే అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేదని, అలాంటి పార్టీ యూపీలో 100 స్థానాల్లో బరిలో దిగుతామనడం హాస్యాస్పదం అన్నారు. బీహార్ లో ఎంఐఎం ఎవరి లబ్ధికోసం పోటీ చేసింది? ఇప్పుడు యూపీలో ఎందుకు పోటీ చేస్తోంది..? అని ప్రశ్నించారు.
మొత్తమ్మీద ఎంఐఎం ఎంట్రీతో యూపీలో రాజకీయ సమీకరణాలు మారతాయనే అంచనాలున్నాయి. బీహార్ లో లాగా బీజేపీకి లాభం చేకూర్చడానికే యూపీలో కూడా ఎంఐఎం పోటీ చేస్తోందని, యోగి సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోడానికే మజ్లిస్ ని సీన్ లోకి తెచ్చారని బీజేపీ వైరిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.