తగ్గేదే లేదన్న కేసీఆర్.. ఆయనకదే చివరి ప్రసంగమన్న రేవంత్..

తెలంగాణలో దళితబంధు రాజకీయ సెగలు రేపింది. ప్రతిపక్షాల ఆరోపణలు, అవాంతరాల మధ్య కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. లాంఛనంగా 15 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెక్కులు అందించారు. అంతే కాదు, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులో పెడతామని, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగస్తులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని మరో సంచలన హామీ ఇచ్చారు కేసీఆర్. 75 ఏళ్ల స్వాతంత్ర […]

Advertisement
Update:2021-08-17 02:46 IST

తెలంగాణలో దళితబంధు రాజకీయ సెగలు రేపింది. ప్రతిపక్షాల ఆరోపణలు, అవాంతరాల మధ్య కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. లాంఛనంగా 15 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెక్కులు అందించారు. అంతే కాదు, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులో పెడతామని, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగస్తులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని మరో సంచలన హామీ ఇచ్చారు కేసీఆర్.

75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదని, కేసీఆర్ అనే సీఎం తలచుకున్నాక ఎలాంటి కార్యక్రమం కూడా ఆగదని అన్నారు. కిరికిరిగాళ్లు, కొండిగాళ్లు ఉండనే ఉంటారు, తీసుకునేవాళ్లకు ఇచ్చేవాళ్లకు లేని లొల్లి మధ్యలో ఉన్నవాళ్లకెందుకు అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు కేసీఆర్.

వరాలే వరాలు..
దళితబంధు రాష్ట్రమంతా వర్తింపజేస్తామంటున్న కేసీఆర్. కొత్తగా పెళ్లై వేరు పడిన కుటుంబాలకు కూడా దీన్ని వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే బ్యాంకులో అకౌంట్లు ఉండి, లోన్లు ఉన్నవారికి దళితబంధు నిధులు వృథా కాకుండా కొత్త అకౌంట్ తెరిచి అందులో ఆర్థిక సాయం జమ చేస్తామన్నారు. ఒక్కసారే అన్ని చెబితే కొందరికి గుండెపోటొస్తుందని, అందుకే అన్నీ ఒకేసారి చెప్పబోనని, ఏం చేయాలో, ఎట్లా చేయాలో అన్నీ తనకు తెలుసని, తన లెక్కలు తనకున్నాయని అన్నారు కేసీఆర్.

ఓటమి భయంతోనే కేసీఆర్ వరాలు..
మరోవైపు దళితబంధు ప్రారంభం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ కథ ముగిసిపోతోందని, రాజకీయంగా ఆయనకు అదే చివరి ప్రసంగమని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌ లో విజయం కోసం దళితులు, గిరిజనులను మరోసారి వంచించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. ఉప ఎన్నిక తుపానులో కేసీఆర్‌ కొట్టుకుపోతారన్నారు. ఏడున్నరేళ్ల కాలంలో మొదటిసారి కేసీఆర్‌ ముఖంలో ఓటమి భయం, ఆందోళన కనిపించాయన్నారు రేవంత్ రెడ్డి. కేవలం హామీ ఇచ్చి, 15 కుటుంబాలకు చెక్కులిచ్చి సరిపెడితే కుదరదని, రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనుల కుటుంబాలన్నింటికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు నెలల్లోపు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామంటే.. ప్రభుత్వం కోరుకున్నచోట కాంగ్రెస్‌ సంతకం పెడుతుందని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

వీటి సంగతేంటి సారూ..?
దళిత బంధు గురించి గొప్పగా చెబుతున్న కేసీఆర్. గతంలో తానిచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. దళిత సీఎం, మూడెకరాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.. ఇలా ఏడున్నరేళ్లలో దళితులు, గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. ఈ నెల 18న చేవెళ్ల రావిర్యాల దండోరా సభ తర్వాత హుజూరాబాద్‌ లో దండెత్తుతామన్నారు. దళితులను మోసం చేస్తున్నందుకు కేసీఆర్‌ ఇంటి ఎదుట ఆందోళన చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News