ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

ఈటల రాజేందర్ వ్యవహారం కేవలం అసైన్డ్ భూములకే పరిమితం అయ్యేలా కనిపించడంలేదు. పాత లెక్కలన్నీ ఇప్పుడు కొత్తగా బయటకు తీస్తున్నారు అధికారులు. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ ప్రముఖంగా తెరపైకి వస్తోంది. దీనికి సంబంధించి ఏకంగా నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం విశేషం. పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రఘునందన్‌ రావు నేతృత్వంలో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, మంచిర్యాల కలెక్టర్ భారతి, మేడ్చల్‌-మల్కాజ్ గిరి కలెక్టర్ శ్వేతా మహంతి సభ్యులుగా ఈ […]

Advertisement
Update:2021-05-04 04:10 IST

ఈటల రాజేందర్ వ్యవహారం కేవలం అసైన్డ్ భూములకే పరిమితం అయ్యేలా కనిపించడంలేదు. పాత లెక్కలన్నీ ఇప్పుడు కొత్తగా బయటకు తీస్తున్నారు అధికారులు. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ ప్రముఖంగా తెరపైకి వస్తోంది. దీనికి సంబంధించి ఏకంగా నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం విశేషం. పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రఘునందన్‌ రావు నేతృత్వంలో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, మంచిర్యాల కలెక్టర్ భారతి, మేడ్చల్‌-మల్కాజ్ గిరి కలెక్టర్ శ్వేతా మహంతి సభ్యులుగా ఈ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్ గ్రామ పరిధిలోని సీతారామస్వామి దేవాలయాల భూములను ఈటల వర్గం ఆక్రమించినట్టు, అక్రమ కట్టడాలు నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ విచారణతోపాటు, ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ దేవాలయానికి 1,521 ఎకరాల 13 గుంటల భూమి ఉందని దేవాదాయ శాఖ పేర్కొంది. ఇందులో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ భూ బదలాయింపులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని విచారణ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సహా మరికొందరు వ్యక్తులు దేవాదాయ భూములను ఆక్రమించుకున్నట్లు పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయని, వాటి విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సీఎస్ తన విచారణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం వీటన్నింటిని పరిశీలించి సమగ్ర విచారణకు ఆదేశించిందని వివరించారాయన. ఇలా కమిటీని నియమించడం, అలా ఆ కమిటీ రంగంలోకి దిగి విచారణ చేపట్టడం కూడా చకచగా జరిగిపోయాయి. మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో విచారణ ఎంత వేగంగా జరిగిందో.. దేవాలయ భూముల విషయంలో కూడా అంతే వేగంగా కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లింది.

మరోవైపు మాసాయిపేట భూముల వ్యవహారంపై వరుసగా మూడోరోజు కూడా ఏసీబీ, విజిలెన్స్‌ విచారణ కొనసాగింది. అచ్చంపేట, హకీంపేట పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించిన అధికారులు, పలు రికార్డులు తనిఖీ చేశారు. అనుమతి లేని నిర్మాణాలను స్థానిక సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదని, పన్నులు చెల్లించకపోతే నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టా, అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకోసం వినియోగిస్తే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించారు. మొత్తమ్మీద అసైన్డ్ భూముల వ్యవహారంతోపాటు.. దేవాదాయ శాఖ భూముల విషయంలో కూడా ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News