పవన్ పేరుతో ఇబ్బంది పడుతున్న బీజేపీ..
పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా? వస్తే ఎప్పుడొస్తారు? అసలు మీకు జనసేనతో సయోధ్య ఉందా లేదా? తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మీకు సపోర్ట్ చేస్తోందా..? బీజేపీ నేతలకు ఎదురవుతున్న కామన్ క్వశ్చన్స్ ఇవి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాషాయదళం ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అసలు విషయాలు వదిలేసి, పవన్ ఎప్పుడొస్తారంటూ ప్రశ్నలు వేస్తోంది మీడియా. ఒకరకంగా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలు మరుగునపడిపోయాయని సంబరపడ్డా.. పవన్ మీద మీడియా అడిగే ప్రశ్నలతో […]
పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా? వస్తే ఎప్పుడొస్తారు? అసలు మీకు జనసేనతో సయోధ్య ఉందా లేదా? తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మీకు సపోర్ట్ చేస్తోందా..? బీజేపీ నేతలకు ఎదురవుతున్న కామన్ క్వశ్చన్స్ ఇవి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాషాయదళం ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అసలు విషయాలు వదిలేసి, పవన్ ఎప్పుడొస్తారంటూ ప్రశ్నలు వేస్తోంది మీడియా. ఒకరకంగా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలు మరుగునపడిపోయాయని సంబరపడ్డా.. పవన్ మీద మీడియా అడిగే ప్రశ్నలతో విసిగిపోతున్నారు బీజేపీ నేతలు.
పవన్ వస్తేనే మద్దతు ఉన్నట్టా..?
బీజేపీ-జనసేన మధ్య విభేదాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో అభ్యర్థి రత్నప్రభ సహా.. కీలక నేతలంతా స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ని కలసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రచారంపై కూడా వారి మధ్య చర్చలు జరిగాయి. అయితే బయటకొచ్చిన బీజేపీ నేతలు మాత్రం పవన్ కచ్చితంగా ప్రచారానికి వస్తారని చెప్పుకుంటుంటే.. జనసేన తరపున అలాంటి ఊసే లేదు. పవన్ కాదు కదా, కనీసం నాదెండ్ల మనోహర్ అయినా ప్రచారం చేస్తారా అనేది అనుమానమే. ఇలాంటి అనుమానాల మధ్య అసలు జనసైనికులు బీజేపీతో కలసి ఎలా పనిచేస్తారనేది కూడా ప్రధాన సమస్య.
కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలంటూ.. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ కటౌట్ తో బ్రహ్మానందం వచ్చి హడావిడి చేసినట్టు.. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు వేసుకుని సరిపెడుతున్నారు బీజేపీ నేతలు. జనసేనానిని ప్రచారంలోకి దించితే సగం విజయం సాధించినట్టేనని ఫీలవుతున్నారు. ఇప్పటికే మీడియా అడిగే ప్రశ్నలతో విసిగిపోతున్నారు. పదే పదే పవన్ ప్రచారానికి వస్తారని తాము చెప్పుకోవడమే కానీ, అటునుంచి కనీసం ఓ ప్రకటన కూడా విడుదల కాకపోవడంతో బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అధిష్టానం ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో బిజీగా ఉండటంతో ఇటువైపు కన్నెత్తి చూడటంలేదు. తెలంగాణ నాయకులు కూడా నాగార్జున సాగర్ ఎన్నికతో బిజీ అయిపోయారు. ఈ దశలో పవన్ కల్యాణ్ ఒక్కరే బీజేపీకి ఉన్న స్టార్ క్యాంపెయినర్. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం కమలదళం కష్ట పడుతోంది, మీడియా ప్రశ్నల్ని మౌనంగా భరిస్తోంది.