మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి
ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ వేదిక;
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దగ్గుబాటి ప్రపంచతత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని అన్నారు. ఆయన తన తోడల్లుడని.. ఎన్‌టీఆర్ వద్ద అన్నీ నేర్చుకున్నామని తెలిపారు. ఆయన ఇలాంటి పుస్తకం రాస్తారని ఎవరూ అనుకోరని.. ఎవరూ చేయని సాహసాన్ని దగ్గుబాటి చేశారన్నారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు.
దగ్గుబాటి ఈ పుస్తకాన్ని సరళమైన భాషలో రాశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాబోయే తరాలకు జ్ఞానం, విజ్ఞానం అందించాలని పెద్దలు చెప్తుంటారని.. దగ్గుబాటి ఈ పుస్తకంతో ఆ ప్రయత్నం చేశారన్నారు. భారతదేశ చరిత్రను కూడా రాయాలని దగ్గుబాటికి సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన గురించి పుస్తకం రాయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. భారతదేశం సాధించిన విజయగాథలన్నీ ఒక్కచోట చేర్చి పుస్తకంగా రాయాలని కోరారు. గతంలో తనకు చంద్రబాబుతో విభేదాలు ఉండేవని.. ఇప్పుడవన్నీ మర్చిపోయామని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు అన్నారు. కార్యక్రమంలో దగ్గుబాటి సతీమణి, ఎంపీ పురందీశ్వరి, ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.